అష్టైశ్వర్యం.. వరలక్ష్మీ వ్రతం..

అష్టైశ్వర్యం.. వరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసం వర్ణ శోభితం. తెలుగు లోగిళ్లన్నీ దేవాలయాలను తలపిస్తాయి. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు హిందువులు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. అమ్మను కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంటుంది. లోకంలో స్త్రీలు సకల సంపదలూ పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతి ఆది దేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు, సతీదేవికి వరలక్ష్మీ వ్రత మహత్యాన్యి వివరించాడని ప్రతీతి. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడని చెబుతారు.

భర్త, అత్తమామలపట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుండేది. మహాలక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తి శ్రద్దలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా ఇల్లాలిపట్ల వరలక్ష్మీ దేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో చారుమతికి లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంది చారుమతి. దాంతో ఆమెకు అష్టైశ్వర్యాలు లభించాయని పురాణ కథనం. పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి కృపకు పాత్రురాలవుతుంది.

అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీ దేవికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. మిగిలిన లక్ష్మీదేవిల పూజలకంటే వరలక్ష్మీ దేవి పూజ శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. శ్రీహరికి ఇష్టమైన, విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్ట సిద్ధి కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story