సర్కారీ బడిలో కలెక్టర్ గారి అమ్మాయి..

సర్కారీ బడిలో కలెక్టర్ గారి అమ్మాయి..

కలెక్టర్ కూతురు కార్పొరేట్ స్కూల్లో చదువుతుంది. ఇందులో వింతేమీ లేదు. కానీ అదే కలెక్టరమ్మ కూతురు సర్కారీ బడిలో చదివితే అది కదా వార్త. సర్కారీ బడులన్నా, సర్కారీ దవాఖానాలన్నా ఓ చిన్న చూపు ప్రజల్లో. అర కొర వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో అయితే, ఇక గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తే వచ్చే నాలుగు అక్షరాలు కూడా రాకుండా పోతాయని నేటి తల్లిదండ్రులు వాటి మొహమైనా చూడట్లేదు. మరి ఓ జిల్లాకి కలెక్టర్ అయిన అయేషా మస్రత్ ఖానం తన కూతురిని వికారాబాద్ పట్టణ శివారు శివారెడ్డిపేట్‌లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో డేస్కాలర్‌గా చేర్పించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం.. తన కూతురు తబిష్ రైనాని గురుకుల పాఠశాలలో చేర్పించి ప్రజల్లో ఈ పాఠశాలలపట్ల మరింత నమ్మకాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 4వతరగతి వరకు రైనా ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో చదివింది. కలెక్టర్ తన కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించడం పట్ల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల సొసైటీ కార్యదర్శి షపీయుల్లా ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ నిర్ణయం ఆదర్శప్రాయమన్నారు. సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని, కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా విద్యాబోధన అందిస్తున్నామని షఫీయుల్లా చెప్పారు. కలక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్కారీ విద్యపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story