కండోములు మరీ పెద్దవైపోతున్నాయట...!

భారతీయ పురుషులకు ఇంటర్నేషనల్ సైజుల ప్రకారం తయారయిన కండోములు మరీ పెద్దవైపోతున్నట్లు ఒక సర్వే తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో హెచ్‌ఐవి కేసులు అధికంగా నమోదవుతున్న దేశంగా పేరుపొందిన దేశాన్ని ఈ వార్త మరింత కుంగదీస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెండేళ్ళపాటు దేశవ్యాప్తంగా ఉన్న పురుషులపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో భారతీయ పురుషులకు అంతర్జాతీయ సైజుల ప్రకారం తయారుచేసిన కండోములు మరీపెద్దవైపోయినట్లు తేలింది.
అంటే... మన మగాళ్ళ పురుషాంగాల పరిమాణం చిన్నదిగా ఉందన్నమాట. దీంతో దేశంలో చిన్న సైజు కండోముల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఎక్కువయింది. దేశంలోని అన్నివర్గాలకు చెందిన 1200 వందల మంది భారతీయ పురుషుల పురుషాంగాలను పరిశీలించారు. ఇందులో అరవై శాతం మంది పురుషాంగాలు...కండోమ్ తయారీకి ఉపయోగిస్తున్న ఇంటర్నేషనల్ కొలతలకు మూడు నుండి అయిదు సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కండోమ్ వాడినా... ఫలితం లేకుండాపోతోంది.
ఇప్పటికే ఒక పురుషుడు అయిదు సార్లు కండోమ్ వాడితే అందులో ఒకసారి... దాని పరిమాణం పెద్దదవడం వల్లో... లేక చినిగిపోవడం వల్లో ... కారణం ఏదైనా కండోమ్ వాడకం ఫెయిలయిపోతోంది. అసలే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యపెరిగిపోతున్న తరుణంలో కండోములవాడకంలో ఇటువంటి సమస్యతలెత్తడం అందోళన కలిగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇప్పటికీ మందుల షాపుల్లో చిన్న సైజు కండోములు అందుబాటులో ఉన్నాయని... మన పురుష పుంగవులు నోరుతెరిచి చిన్న కండోములు ఇవ్వమని అడగడానికి సిగ్గుపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డాక్టర్లు అంటున్నారు.
మరో వాస్తవం ఏమిటంటే... ఈ అధ్యయనంలో... మన మగాళ్ళ పురుషాంగాలు కాస్తచిన్నవిగా ఉన్నాయనే సంగతి... వారికి మనస్థాపాన్ని కలిగిస్తోంది. కానీ సైజు తక్కువైనంత మాత్రాన బెంబేలు పడవలసిన పనిలేదని... శృంగారంలో మామూలు తృప్తినే పొందవచ్చని డాక్టర్లు ఓదార్పు వాక్యాలు పలుకుతున్నారు. భారతదేశం వంటి సాంప్రదాయ దేశంలో ఈ పరిశోధన ఫలితాలు కాసింత ఆందోళన కలిగించడం సహజమే.