Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో వలస కార్మికులు..

Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో వలస కార్మికులు..
Covid Cases: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

Covid Cases: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనూ కరోనా కేసులు లక్ష మార్కు దాటేశాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కొత్తగా 41 వేల 434 కేసులు బయటపడ్డాయి. 9 వేల 671 మంది కోలుకోగా 13 మంది మృతిచెందారు.

ముంబయిలో 20 వేల 318 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య లక్షా 41 వేల 492కు చేరింది. ముంబయిలోని ధారావిలో కొత్తగా 147 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఈనెల10వ తేదీ వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నలుగురికి మించి ఎక్కువమంది కలిసి సంచరించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్​ సెంటర్లను ఫిబ్రవరి 15 వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్విమ్మింగ్​ పూల్స్​, జిమ్స్​, స్పాలు, బ్యూటీ సెలూన్​లు, మ్యూజియాలు, ఎంటర్టైన్​మెంట్​ జోన్లను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. సెలూన్లు మాత్రం 50 శాతం మందితో నడుపుకోవచ్చని తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 20 వేల 181 కరోనా కేసులు బయటపడ్డాయి. ఏడుగురు మరణించారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేసుల పెరుగుదలతో సీఎం కేజ్రీవాల్‌ ఆంక్షలు విధించారు. రాజకీయ బహిరంగ సభలు, సమావేశాలను రద్దు చేశారు. బంగాల్‌లో కొత్తగా 18 వేల 802 కేసులు నమోదు అయ్యాయి.

19 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 62 వేల 055 ఉంది. ఇటు కర్ణాటకలో మొత్తం 8 వేల 906 కొత్త వైరస్​ కేసులు వెలుగు చూశాయి. 508 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 38 వేల 366కు చేరింది. బెంగళూరులో పాజిటివిటీ రేటు పది శాతానికి పైగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అక్కడ కొత్తగా 7 వేల 113 కేసులు వెలుగు చూసినట్లు తెలిపారు.

కేరళలో ఒక్కరోజే 5 వేల 944 కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 33 మంది చనిపోయినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31 వేల 98గా ఉంది. పుణెలో మరో 60 మంది పోలీసులు వైరస్​ బారిన పడ్డారు. దీంతో శాఖలో మొత్తం కేసుల సంఖ్య 185కు చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 27 మంది ఉన్నతాధికారులు కాగా.. మరో 158 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్​లో వైరస్​వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 15 వరకు రాజకీయ, మత, సామాజిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్​సింగ్ ధామీ తెలిపారు. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌లో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్, సూరత్ నగరంలో కొవిడ్​ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

దీంతో రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. కేసులు భారీగా పెరుగుతుండటంతో వలస కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో చాలా మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. పెద్ద సంఖ్యలో కార్మికులు రైల్వే స్టేషన్లకు చేరుకుని స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story