Karnataka: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు మళ్లీ ప్రారంభం..

Karnataka: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు మళ్లీ ప్రారంభం..
Karnataka: హిజాబ్‌ వివాదం కారణంగా సెలవులు ప్రకటించిన కాలేజీలను రేపట్నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌ వివాదం కారణంగా సెలవులు ప్రకటించిన కాలేజీలను రేపట్నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 16 నుంచి అన్ని ప్రీ-యూనివర్శిటీ కళాశాలలు, డిగ్రీ కాలేజీలను తిరిగి తెరుస్తున్నట్లు మంత్రి బీసీ నగేశ్‌ ప్రకటించారు. సీఎం , హోంమంత్రి, విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో కళాశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కళాశాలలు తెరిచేలోపు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు.. ఇవాళ కర్ణాటక హైకోర్టులో.. ఈ అంశంపై విచారణ జరగనుంది. కర్ణాటకలో హిజాబ్‌ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలు చెలరేగడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 8వ తేదీ నుంచి మూడ్రోజులు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత వాటిని పొడిగించింది.

అయితే.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే పలుచోట్ల కొందరు విద్యార్థులు హిజాబ్‌తో పాఠశాలలకు రాగా.. వాటిని తొలగించిన తర్వాతే యాజమాన్యం లోనికి అనుమతించింది. పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య పలు చోట్ల వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుస్తుగా పోలీసులు పలు ప్రాంతాల్లో సెక్షన్‌ 144ను విధించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story