Swami Sivananda: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన 125 ఏళ్ల యోగా గురువు.. వీడియో వైరల్..

Swami Sivananda: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన 125 ఏళ్ల యోగా గురువు.. వీడియో వైరల్..
Swami Sivananda: 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Swami Sivananda: ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. 125 ఏళ్ల యోగ గురువు స్వామి శివానంద పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకునే ముందు.. 125 ఏళ్ల స్వామి శివానంద.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆశ్చర్య పరిచారు. ప్రతిగా ప్రధాని మోదీ సైతం శివానందకు ప్రతి నమస్కారం చేశారు. అనంతరం.. రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు శివానంద. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో పైకి లేపారు.

1896 ఆగస్టు 8న...ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హేట్‌ జిల్లాలో జన్మించారు స్వామి శివానంద.ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని కోల్పోయిన శివానందను పశ్చిమ బెంగాల్‌ నబద్వీప్‌లోని గురూజీ ఆశ్రమంలో గురు ఓంకారానంద గోస్వామి అక్కున చేర్చుకున్నారు. యోగాతో సహా అన్ని ఆధ్యాత్మిక విద్యలు నేర్పించారు.125 ఏళ్లలోనూ ఎంతో చక్కగా యోగాలు, వ్యాయమాలు వేస్తారు స్వామి శివానంద.

ఆపన్నుల్ని సేవించడంలో ముందుంటారు స్వామి శివానంద.వారణాసి, పూరి, హరిద్వార్, నబద్వీప్ తదితర ప్రాంతాలలో నిరుపేదలకు సేవలందిస్తున్నారు. గత 50 ఏళ్లుగా దాదాపు 600 మంది కుష్టువ్యాధి పీడిత యాచకుల్నిఆదుకున్నారు. ఇలాంటి వారికి పూరీలో గౌరవప్రదంగా సేవ చేస్తూ అండగా ఉంటున్నారు. ప్రపంచమే తన ఇల్లు, ప్రజలే తల్లిదండ్రులని బలంగా నమ్మే స్వామి శివానంద.. తన జీవితాన్ని మానవ సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేశారు.

125 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు స్వామి శివానంద. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు. కరోనా టీకా వేసుకుని.. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అతని జీవనశైలి, ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకునేందుకు... కార్పొరేట్ ఆసుపత్రులు క్యూలు కట్టాయి. కాంప్లిమెంటరీ మాస్టర్ హెల్త్ చెకప్‌లను నిర్వహించాయి. ఎలాంటి కోరికలు లేకపోవడం, సరళమైన జీవితం, నిత్యం యోగ, వ్యాయమనే తన ఆరోగ్య రహస్యమంటారు స్వామి శివానంద.

స్వామి శివానంద చేసిన సేవలకు..అనేక అవార్డులు వరించాయి. 2019లో యోగా రత్న, బసుంధర రతన్ అవార్డును అందుకున్నారు. అదే ఏడాది ప్రపంచ యోగా దినోత్సవమైన జూన్ 21న జరిగిన యోగా ప్రదర్శనలో దేశం నుంచి అత్యంత సీనియర్‌గా పాల్గొన్న వ్యక్తిగా రికార్డు పొందారు. స్వామి శివానంద సేవల్ని గుర్తించిన కేంద్రం.. ఇప్పుడు పద్మశ్రీతో సత్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story