భారత్‌కు అదే కలిసొచ్చింది..

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారత్‌,పాకిస్థాన్ వరల్డ్‌కప్ ఫైట్‌ వన్‌సైడ్‌గా ముగిసింది. ఊహించినట్టుగానే తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించింది. వరుస రెండు విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేనకు పాక్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. వరుణుడు అడ్డుపడే అవకాశాలుండడంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపిన పాకిస్థాన్ కెప్టెన్‌ వ్యూహం ఆరంభంలోనే విఫలమైంది. తొలి ఐదు ఓవర్లు తప్పిస్తే… పాక్ బౌలర్లు ఏ దశలోనూ భారత్‌ను ఇబ్బందిపెట్టలేకపోయారు. ధావన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కెఎల్ రాహుత్‌, రోహిత్‌శర్మ ఓపెనింగ్ పార్టనర్‌షిప్ భారత్ భారీస్కోర్‌లో కీలకంగా చెప్పొచ్చు. రాహుల్ ఔటైనా… రోహిత్‌శర్మ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. మొదటి 20 ఓవర్లలో వికెట్ చేజార్చుకోకుండా ఆడడం భారత్‌కు కలిసొచ్చింది.

తర్వాత విరాట్‌కోహ్లీ, పాండ్యా జోరు టీమిండియా స్కోరును 300 దాటించింది. ధాటిగా ఆడిన కోహ్లీ 77 పరుగులకు ఔటవగా…విజయ్ శంకర్, కేదార్ జాదవ్ చివర్లో ధాటిగా ఆడడంతో 336 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో పాకిస్థాన్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఇమాముల్ త్వరగానే ఔటవగా… ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్‌కు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ సెంచరీ పార్టనర్‌షిప్ సాధించినా… స్పిన్నర్‌ కుల్‌దీప్ ఎంట్రీతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. తర్వాత అంచనాలు పెట్టుకున్న పాక్ సీనియర్ బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో కోహ్లీసేన విజయం ఖాయమైంది. వరుణుడి ఎంట్రీ మ్యాచ్‌ను ఆలస్యం చేసిందే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. దీంతో మరోసారి ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో పాక్‌పై ఆడేటప్పుడు ఏమాత్రం ఒత్తిడికి గురవకపోవడం కోహ్లీ గ్యాంగ్ విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఫైనల్‌ కాని ఫైనల్‌గా భావించిన ఈ పోరులో భారత్ నూటికి నూరుశాతం అదిరిపోయే ప్రదర్శనతో ప్రపంచకప్‌ టైటిల్ రేసులో మరో విజయాన్ని రుచి చూసింది.

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా భారత్‌,పాక్ పోరును సామన్యుడి నుండి సెలబ్రిటీ వరకూ ఆస్వాదించారు. స్టేడియంలో పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తే… దేశవ్యాప్తంగా భారత అభిమానులు టీవీ స్క్రీన్స్‌కు అతుక్కుపోయారు. మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో అటు స్టేడియం దగ్గరా… ఇటు దేశంలో పలు ప్రధాన నగరాల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *