ఎంతలో ఎంత మార్పు? ..ఆఖర్లో వచ్చిన వాళ్లే..

ఎంతలో ఎంత మార్పు? ..ఆఖర్లో  వచ్చిన వాళ్లే..

వరల్డ్‌ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుకు పాకిస్తాన్‌ షాక్‌ ఇచ్చింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ గెలుపు అంచుకు చేరుకుని..చివర్లో బోల్తా పడింది. నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌.. ఓటమిని మూటగట్టుకుంది. జో రూట్, బట్లర్ సెంచరీలు వృధా అయ్యాయి.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్… 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పాక్‌ బ్యాట్సమెన్లలో మహ్మద్ హఫీజ్ 84, బాబర్ ఆజామ్ 63, సర్ఫరాజ్ అహ్మద్ 55, ఇమామ్-ఉల్-హక్ 44, ఫకార్ జమాన్ 36 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలింగ్‌లో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు.

349 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ప్రాంరభించిన ఇంగ్లండ్‌..50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు సరైన శుభారంభాన్ని అందించలేదు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. బెయిర్‌ స్టో, మోర్గాన్‌, స్టోక్స్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సమయంలో శతకాలతో జో రూట్‌, బట్లర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీర్దిదరూ స్కోర్‌ బోర్డు వేగం పెంచారు. అయితే జో రూట్‌ షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగా… మరికాసేపటికే శతకం చేసిన బట్లర్‌ను అమిర్‌ బోల్తా కొట్టించాడు. చివరి ఓవర్లలో పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.

Tags

Read MoreRead Less
Next Story