టీమిండియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌.. వివాదాస్పద బ్యానర్‌తో విమానం..

టీమిండియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌.. వివాదాస్పద బ్యానర్‌తో విమానం..

లీడ్స్‌ వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య మ్యాచ్‌ సందర్భంగా... ఆకాశంలో వివాదాస్పద బ్యానర్‌తో ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలనే నినాదం రాసి ఉన్న బ్యానర్‌తో విమానం వెళ్లింది. ఇది పెద్ద వివాదంగా మారడంతో ఐసీసీ స్పందించింది. ఆటలో రాజకీయాలు సరికాదని... ఇలాంటి చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఐసీసీ.

ఈ ఘటనతో వరల్డ్ కప్‌లో నిర్వహణ లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లోఈ టోర్నీలో జరిగిన ఇలాంటి ఘటన... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఆడుతున్న సమయంలోనూ చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా ఓ విమానం జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ స్టేడియం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో స్టేడియంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

వరుసగా రెండు ఘటనలు జరగడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. వివిధ నగరాల్లో ఉన్న స్టేడియాల దగ్గర మరింత నిఘాను పెంచారు.

Tags

Read MoreRead Less
Next Story