గులాబీ గుభాళింపులు 8 స్థానాలకే..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 16 స్థానాల్లో గెలుస్తుందనుకున్న టీఆర్ ఎస్ పార్టీ వాటిలో సగానికే పరిమితమైంది. కేవలం 8 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ లలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి దిశగా పయనిస్తుండడం అందరినీ అశ్చర్యానికి గురి చేస్తోంది. టీఆర్ఎస్ కు కంచుకోటలా భావించే‌ కరీంనగర్‌లోనూ ఆ పార్టీకి ఎదురు గాలి వీచింది. అటు ఖాతా కూడా తెరవడం కష్టమే అనుకున్న నల్గొండ, చేవెళ్ల, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణలో తొలి ఫలితం మెదక్ లోక్ సభ స్థానంలో వచ్చింది. ఇక్కడి నుంచి పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షల పైచిలుకు మెజారిటీతో భారీ విజయం సాధించారు.

ఫారం-7 ను వైసీపీ దుర్వినియోగం చేసింది : సీఎం చంద్రబాబు

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదుచోట్ల రీపోలింగ్ విషయంలో ఈసీ తీరును ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే ఈసీ ఉత్తర్వులివ్వడం కుట్రపూరితమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సీఈసీ సునీల్‌ ఆరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డారు. తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని సీఈవోను నిలదీసినట్టు సీఎం తెలిపారు. సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని.. కానీ నెల రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. 24 ఏళ్లుగా తాను టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నానని, జాతీయ రాజకీయాలను చూశానన్న ఆయన ఈ విధమైన ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మా ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదని గట్టిగా డిమాండ్ చేస్తే.. మరో 2పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు సిఫార్సు చేస్తామన్నారని చంద్రబాబు తెలిపారు.

ఏపీలో ఫారం-7 దుర్వినియోగంలో చర్యలపైనా చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఫారం -7 పత్రాలు ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ స్పందించలేదని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ హోం సెక్రటరీపై చర్యలు తీసుకున్నప్పుడు… అదే పని ఏపీ సీఎస్‌ చేస్తే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

జాతీయకూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న చంద్రబాబు.. మిగతా పార్టీ చేరికపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమిలోకి సీఎం కేసీఆర్‌ ను ఆహ్వానిస్తారా అని అడిగిన ప్రశ్నలకు బీజేపీయేతర పార్టీలు ఏవి వచ్చినా కలిసి పని చేస్తామన్నారు. కేసీఆర్ వచ్చినా ఆహ్వానిస్తామని పరోక్షంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచేలా భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.

మరోసారి తమిళనాడుకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మరోసారి తమిళనాడు వెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించారు. సోమవారం కేరళకు వెళ్లిన కేసీఆర్‌.. అక్కడి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తిరువనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. అయితే డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలువలేకపోయారు. అయితే ఈ సారి స్టాలిన్‌తో భేటీ కాబోతున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరనున్నారు. ఇవాళ శ్రీరంగం ఆలయాన్ని సందర్శించనున్నారు. రేపు స్టాలిన్‌తో భేటీ అవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

స్టాలిన్‌ను ఈ నెల 13న చెన్నైలోని ఆయన నివాసంలో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో స్పష్టం చేసింది. సీఎంవో చెప్పిన తేదీ కంటే ముందే కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉండటంతో ఆయన కేసీఆర్‌తో భేటీ అవడం సాధ్యం కాదని డీఎంకే వర్గాలు తెలిపాయి.

గట్టిగా నిలబడింది టీడీపీ, టీఆర్‌ఎస్ మాత్రమే:కేటీఆర్‌

టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… తెలంగాణ భవన్‌లో గులాబీ జెండా ఆవిష్కరించిన కేటీఆర్‌… 18 ఏళ్లలో పార్టీని కేసీఆర్‌ అజేయశక్తిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అటు అన్ని జిల్లాల్లో ఆవిర్భావ వేడుకలను శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తోందని తెలిపారు… పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. పార్టీ బలోపేతం సమస్యలు సైతం తెస్తుందని.. సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు…

71 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. గట్టిగా నిలబడింది టీడీపీ, టీఆర్‌ఎస్ మాత్రమే అన్నారు కేటీఆర్‌. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కు, కేసీఆర్‌కు మాత్రమే దక్కుతాయన్నారు. నాడు ఎన్టీఆర్‌కు చాలా అంశాలు కలిసొచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు. ఈ 18 ఏళ్లలో ఎన్నో అడ్డంకులను అధిగమించి తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్ నిలిచిందన్నారు….

అటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో…. మంత్రి జగదీష్‌ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఒక ఉద్దేశం కోసం పార్టీ స్థాపించిన వ్యక్తి ఆధ్వర్యంలోనే ఆ లక్ష్యం నెరవేరడం ప్రపంచంలో చాలా అరుదని… అది కేసీఆర్‌ వల్ల సాధ్యమైందని జగదీష్‌ రెడ్డి అన్నారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణలో పరిపాలన సాగుతోందని జగదీష్‌ రెడ్డి అన్నారు…

ఇక అటు వరంగల్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి దయాకర్‌రావు పాల్గొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరే పార్టీకి స్థానం లేదని… త్వరలోనే జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ను చూడబోతున్నారని… దయాకర్‌రావు అన్నారు… మిగతా జిల్లాల్లోనూ పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో.. ఊరూవాడ గులాబీ వర్ణం సంతరించుకున్నాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ రెడీ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా… టీఆర్‌ఎస్‌ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇందుకోసం ఈ నెల 15న పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో.. పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించున్నారు గులాబీ అధినేత!

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్ రెడీ అవుతోంది. లోకల్ బాడీల నుంచి లోక్‌సభ వరకు అన్ని స్థాయిల్లో గులాబీనేతలే ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ ముందుకెళ్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులతోపాటు రాష్ట్రమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం విస్తృతంగా చర్చిస్తారు.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.

మెదక్‌లో డీలా పడిన ప్రధాన పార్టీ.. చేతులెత్తేసిన ముఖ్య నేతలు?

లోక్ సభ ఎన్నికల ప్రచారం గతంలో కంటే భిన్నంగా సాగుతోంది. ప్రధానపార్టీల్లో ఒకటి ప్రచారంలో దూసుకుపోతుంటే.. మరో పార్టీ డీలా పడిపోయింది. అటు పాలమూరులో చిత్రమైన పరిస్థితులు.

మెదక్ పార్లమెంట్ నియోజక వర్గంలో TRS ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. మాజీ మంత్రి, MLA హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. 5లక్షలకు పైగా మెజార్టీ సాధించడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులున్నాయి. కారు స్పీడుగా పరుగులు తీస్తుంటే.. గట్టి పోటీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ అభ్యర్ధి గాలి అనీల్ కుమార్ బేజార్ అవుతున్నారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్న విజయశాంతి గాలి అనీల్ కుమార్ కు పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించారు. మొదటి విడతలోనే ఆయనకు టికెట్ ఖరారు చేసింది. అయితే ఆయన పార్టీలో కొత్తకావడంతో నాయకుల ఇళ్ల చుట్టూ తిరగడానికే సమయం సరిపోయింది. కీలకమైన దశలో ప్రచారంలో కనిపించడం లేదు. మొదట్లో ఉన్న జోష్ ఆయనలో తర్వాత కనిపించడం లేదు.

గత నెల 25న నామినేషన్ వేసినప్పుడు మెదక్ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఇదొక్కటే పార్టీ నిర్వహించిన పెద్ద సభ. తర్వాత పటాన్ చెరులో విజయశాంతి ఒకసారి పర్యటించారు. ఇక ఆ తర్వాత ఎక్కడా ప్రచారం చేయలేదు. కార్యకర్తల సమావేశం, గజ్వేల్ లో రోడ్ షో కూడా సాదాసీదాగా నిర్వహించారు. ఎవరూ కూడా ఇక్కడ ప్రచారానికి రావడం లేదు. రాష్ట్ర నేతలు కనిపించడంలేదు. సమన్వయ లోపంతో గాలి అనీల్ ప్రచారంలో వెనకబడ్డారు. ఇక పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి కూడా కారెక్కడంతో ఆయన పరిస్థితి మరింత దయనీయం. అటు కేడర్ కూడా నిస్తేజంలో నిండిపోయింది. అభ్యర్ధి కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు.

అటు పాలమూరులో TRS అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారవేత్త అయిన మన్నె శ్రీనివాస్ రెడ్డి నేతలను సమన్వయం చేయలేక సతమతమవుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా కొత్తకావడం పెద్ద మైనస్. సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన పార్టీ మారారు. అటు ఎమ్మెల్యేలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేశారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో తిరగడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా మంత్రి శ్రీనివాస గౌడ్ భుజాన బాధ్యతలు పడ్డాయి. ఆయనే మొత్తం ప్రచారం పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ చరిష్మా, పథకాలు, ఆర్ధికంగా బలంగా ఉన్నా అభ్యర్ధి పూర్తిగా కొత్త కావడంతో కార్యకర్తలు ఆయనకు కనెక్ట్ కావడం లేదు. ఇది ప్రచారంపై ప్రభావం చూపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్ధులు తమ లోపాలను అధిగమించకపోతే ప్రతికూల ఫలితాలు తప్పవంటున్నారు నేతలు.

దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిపాయి లేరా : కేటీఆర్

టీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులు, ఆదివాసీలకు న్యాయం జరిగింది – కేటీఆర్‌
ఎన్నికల తర్వాత పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతాం – కేటీఆర్‌
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారు – కేటీఆర్‌
టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుంది – కేటీఆర్‌

 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులు, ఆదివాసీలకు సరైన న్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్‌… టీఆర్‌ఎస్‌ సభ్యులు గెలిస్తేనే తెలంగాణ గడ్డకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని కేటీఆర్‌ మండిపడ్డారు. అలాగే రాహుల్ గాంధిపై కూడా విమర్శలు గుప్పించారు.దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి లేరా అని విమర్శించారు.

రాజీనామా చేశాక సస్పెండేంటి.. : సునీత

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా హస్తం పార్టీని వీడుతూ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఇప్పటికే ఏనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా పార్టీ సినీయర్ నేతలైన మాజీ మంత్రులు డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి,సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారారు. నేతలు పార్టీని వీడడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. స్వార్థ ప్రయోజనాల కోసమే వారు పార్టీని వీడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజా పరిణామాలపై సునీతా లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చకున్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వం లోపం కారణంగానే తాను పార్టీని వీడినట్లు అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపినట్లు వివరించారు. రాజీనామ చేసిన తరువాత తనను పీసీసీ క్రమశిక్షణా సంఘం సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు . కార్యకర్తలను కలిసి చర్చించాకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంచేశారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసినట్లు సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. బీజేపీలోకి తెరాస కీలక నేత

ఎన్నికల వేళ తెలంగాణలో కొనసాగుతున్న జంపింగ్‌ల పర్వం
కాంగ్రెస్‌ను వీడనున్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సునీతా లక్ష్మారెడ్డి
ఏప్రిల్‌ 3 కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న సునీతా
టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి
త్వరలోనే జితేందర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం
రాంమాధవ్‌తో రహస్య మంతనాలు సాగించిన జితేందర్‌ రెడ్డి..!
3 షరతులతో బీజేపీలో చేరేందుకు అంగీకరించిన జితేందర్‌ రెడ్డి.. !
ఈ నెల 29 న మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్న జితేందర్‌ రెడ్డి..!

ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. ఓ దిక్కు పార్టీలోకి చేరికలు కొనసాగుతుండగానే మరోవైపు పార్టీ నుంచి జంపింగ్ ల పర్వం కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఏప్రిల్ 3న కేసీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మరోవైపు ఎంపీ టికెట్ దక్కకపోవటంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 3 షరతులతో బీజేపీలో చేరేలా రాంమాధవ్ తో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ నెల 29న మోదీ సమక్షంలో బీజేపీ జితేందర్ రెడ్డి చేరే అవకాశాలు ఉన్నాయి.

మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం

టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వివేక్ నిర్ణయం
ఇప్పటికే పోలింగ్‌కి సమయం దగ్గర పడినందున..
గుర్తు ప్రజలకు చేరదని పోటీ చేయడం లేదు- వివేక్

మాజీ ఎంపీ వివేక్ తెరాసకు రాజీనామ చేశారు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్‌ను వివేక్ ఆశించినప్పటికీ తెరాస అధిష్టానం దాన్ని ఆయనకు కేటాయించలేదు. దీంతో వివేక్ ఆవేదన చెందినట్లుగా సమాచారం. అలాగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వివేక్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పోలింగ్‌కి సమయం దగ్గర పడడం నామినేషన్ల గడవు ఈ రోజుతో ముగుస్తుడడం, అలాగే ప్రచారం గుర్తు ప్రజలకు చేరదని ఇలా పలు కారణాలతో పోటీ చేయడం లేదని వివేక్ తెలిపారు.