కరోనా టీకాపై గుడ్‌న్యూస్ చెప్పిన ఫైజర్‌

కరోనా టీకాపై గుడ్‌న్యూస్ చెప్పిన ఫైజర్‌

కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో... అమెరికా ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో అభివృద్ధి చేసిన టీకా 95శాతం సమర్థ వంతంగా పనిచేసిందని ప్రకటించింది. జర్మన్‌కు చెందిన బయాన్‌టెక్‌ ఎస్‌ఈతో కలిసి తయారుచేసిన ఈ టీకా ఎంతో సురక్షితమైనదని తెలిపింది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో అన్ని వయస్సుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని, పెద్దగా దుష్ప్రభావాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్ల పైబడినవారిలో కూడా దీని సమర్థత 94శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది.

ఫైజర్ వ్యాక్సిన్‌ను జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి అభివృద్దిచేస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌‌కు సంబంధించి ఫేజ్-3 దశ తుది ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది. కరోనా పాజిటివ్‌గా తేలిన 170 మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్లు.. వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత 95 శాతం సత్ఫలితాలు కనిపించినట్లుగా ఫైజర్ పేర్కొంది. కొద్ది రోజుల్లో.. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ , ఎమర్జన్సీ యూజ్ ఆథరైజేషన్ ను సంప్రదించి ఆమోదం కోసం ప్రతిపాదన పంపనున్నట్లు ప్రకటించింది.

కరోనా టీకా ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ భారత్‌లో ఈ టీకా వినియోగంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచే వాతావరణ పరిస్థితులు భారత్‌లో లేకపోవడమే అందుకు కారణం. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలన్నదే ఇందుకు కారణం. అయితే ఫైజర్ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం లభించిన తర్వాత ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story