హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి : కేటీఆర్

హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి : కేటీఆర్

హైదరాబాద్‌ను మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌. అందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ, మూడు కమిషనరేట్ల కమిషనర్లతో పాటు GHMC మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగరంలో సూమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పది లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసి నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వీటితోపాటు పార్కులు, చెరువులు, బస్తి దావఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమి కూడే ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఉండాల్సిన అవసరం ఉందని ఆ దిశగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసి తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్ లను పోలీస్ శాఖ తయారు చేసుకోవలసిన అవసరం ఉందని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story