Bird Flu In Telangana : తెలంగాణలోనూ బర్డ్‌ఫ్లూ భయాలు .. కొప్పూర్‌లో 120 కోళ్లు మృతి!

Bird Flu In Telangana : తెలంగాణలోనూ బర్డ్‌ఫ్లూ భయాలు ..  కొప్పూర్‌లో 120 కోళ్లు మృతి!
Bird Flu In Telangana : తెలంగాణలోనూ బర్డ్‌ఫ్లూ (bird flu)భయాలు చుట్టుముట్టాయి. రెండు జిల్లాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది.

Bird Flu In Telangana : తెలంగాణలోనూ బర్డ్‌ఫ్లూ (bird flu)భయాలు చుట్టుముట్టాయి. రెండు జిల్లాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. చనిపోయిన కోళ్లను కాల్వలు, రోడ్డు పక్కన పడేయడంతో బర్డ్‌ఫ్లూ కారణంగానే అలా పడేశారని అనుమానిస్తున్నారు ప్రజలు. దీంతో బర్డ్‌ఫ్లూ భయాలు మరింత పెరిగాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి(Bhimadevarapall) మండలం కొప్పూర్‌కు చెందిన రైతు గద్ద సారయ్యకు చెందిన 120 కోళ్లు చనిపోయాయి. వాటిని స్థానిక పశువైద్యాధికారులు పరిశీలించారు. చనిపోయిన వాటికి బర్డ్‌ఫ్లూ సోకిన లక్షణాలు లేవని చెప్పారు. నమూనాలను హైదరాబాద్‌ పంపించామని తెలిపారు.

మరోవైపు పెద్దపల్లి జిల్లా ఓదెలలోనూ వారం రోజుల నుంచి 300 నాటు కోళ్లు, బ్రాయిలర్‌ కోళ్లు చనిపోయాయి. వారం రోజులుగా రోజుకు నాలుగైదు కోళ్లు చనిపోతున్నాయని స్ధానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వీధిలో పదుల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని, ఈ విషయం పశుసంవర్థక శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని భావిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. వాటిని ఎస్సారెస్పీ డీ-86 కాలువలో పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది.

కోళ్లకు వ్యాక్సినేషన్‌ చేయించకపోవడం, వాతావరణంలో మార్పుల వల్లే కోళ్లు చనిపోతాయని పశుసంవర్థక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా వైరస్‌లు సోకకుండా వ్యాక్సిన్‌ వేస్తారని, కోళ్లకు వ్యాక్సిన్‌ వేయకపోవడం వల్లనే అవి చనిపోతున్నాయని తెలిపారు. చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనబడలేదని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.

కేరళ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా పక్షులు, కోళ్లఫారాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ వ్యాధి దాఖలాలు లేకున్నా పశుసంవర్ధకశాఖ పరీక్షలు చేయిస్తోంది. రాష్ట్రంలో కోళ్ల నుంచి సేకరించిన 276 నమూనాలను పశు వైద్య జీవ ప్రయోగశాలలో పరీక్షించినా వ్యాధి లక్షణాలేమీ కనిపించలేదు. మరో 534 నమూనాలను బెంగళూరుకు పంపారు. బర్డ్‌ఫ్లూ నుంచి జంతువులను, పక్షులను పరిరక్షించడానికి హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఎక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనపడలేదు. కానీ ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల పశు వైద్యాధికారులకు ఆదేశించారు. కోడి మాంసంపై ఎలాంటి దుష్ప్రచారం చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు బర్డ్‌ఫ్లూ ఉపద్రవంలా ముంచుకొస్తోంది. ఒక్కో రాష్ట్రానికీ పాకుతోంది. పరిస్థితిని ముందే ఊహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. బర్డ్‌ ఫ్లూ సోకిన 10 మందిలో ఆరుగురు చనిపోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతుండడంతో కేంద్రం అప్రమత్తం అయింది. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు, పక్షులను వధించడానికి అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపింది. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గుడ్లు, మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలని, ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించింది.

రాష్ట్రాలతో నిరంతర సమన్వయం, సూచనల జారీ కోసం ఢిల్లీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కేరళ, హర్యానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపింది. కేరళలో ఇప్పటికే 61వేలకు పైగా బాతులు, కోళ్లతో సహా పక్షులను వధించారు. గుజరాత్‌లోని మొథేరాలో సూర్యదేవాలయం సమీపంలో నాలుగు కాకులు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య పరీక్షల నిమత్తం భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story