కబడ్డీ గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా?

కబడ్డీ గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా?
పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది.

సూర్యాపేటలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. ప్రేక్షకుల కోసం స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో 150 గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా? మరేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది.

క్రీడలు ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బాధితుల ఆర్ధనాధాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితోపాటు పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు. ఘటన అనంతరం జిల్లా ఎస్పీ భాస్కరన్ శరవేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటన జరిగిన సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది.

ఇక ఆస్పత్రుల్లో క్షతగాత్రులను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. క్షతగాత్రులెవరూ ప్రాణాపాయ స్థితిలో లేరన్నారు. గాయపడ్డ బాధితులంతా కోలుకుంటున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. క్రీడాకారులు నిరాశ చెందవద్దని యథావిధిగా పోటీలు కొనసాగిస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

అటు ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు స్టేడియంలో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీల ఏర్పాటుకు 90టన్నుల ఇనుము, 60టన్నుల కలపను వినియోగించారు. అలాగే, 20అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5వేల మంది కూర్చొనేలా మొత్తం 15వేల సామర్థ్యంతో మూడు గ్యాలరీలు నిర్మించారు. వీటికి వినియోగించిన ఇనుపరాడ్లు కొందరి కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఇప్పటివరకు ఎన్నడూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరగలేదు. దీంతో ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని భావించారు. ఈ క్రీడా పోటీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. అయితే, ఎంత భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ క్రీడా పోటీలు మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం కానున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది.

Tags

Read MoreRead Less
Next Story