డబ్బు కోసం 3 పెళ్లిళ్లు చేసుకున్న ప్రబుద్ధుడు

సులువుగా డబ్బులు సంపాదించేందుకు పెళ్లి అనే పవిత్ర బంధాన్ని వాడుకున్నాడో చీటర్. మాయమాటలతో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాళి కట్టడం, భార్యతో అసభ్యకరమైన ఫోటోలు దిగడం, వాటితో బ్లాక్ మెయిల్‌ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే మూడో భార్య ఫిర్యాదుతో ఆ కేటుగాడి గుట్టురట్టయింది.

కొంత కాలంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ప్రవీణ్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవీపల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. ఓ వాటర్ ఫ్యూరిఫైయిర్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్నరాజేశ్వరితో పరిచయం పెంచుకున్నాడు. తనకు ఎవ్వరూ లేరని నమ్మబలికాడు. గత మే 10న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాజేశ్వరి పేరుతో మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, ఆమె దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టి 2 లక్షల రుణం తీసుకున్నాడు. అంతేకాదు ఆమె దగ్గరున్న 80 వేల నగదు కూడా తీసుకున్నాడు. అయితే రాజేశ్వరితో పెళ్లి విషయం ఆలస్యంగా తెలుసుకున్న ప్రవీణ్‌ తల్లిదండ్రులు కొత్తగూడెం వచ్చారు. తమ కొడుకును ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ రాజేశ్వరిని నిలదీశారు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ప్రవీణ్ తనకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని బయటపెట్టాడు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చానని తెలిపాడు. రాజేశ్వరీ భర్తపై అనుమానంతో అతని కంప్యూటర్ చెక్ చేసింది. చాలా మంది అమ్మాయిలను లోబరుచుకుని, రాసలీలలను వీడియోలుగా చిత్రీకరించి, వాటితో బ్లాక్ మెయిల్‌ చేస్తూ, డబ్బులు వసూలు చేస్తున్న విషయం బయటపడింది. దీంతో రాజేశ్వరి మహిళల సంఘాలతో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *