హైదరాబాద్‌లో పెట్రేగిపోతున్న మందుబాబులు.. ఒక్క రోజే నాలుగు యాక్సిడెంట్లు

హైదరాబాద్‌లో పెట్రేగిపోతున్న మందుబాబులు.. ఒక్క రోజే నాలుగు యాక్సిడెంట్లు
వాహనం జాగ్రత్తగా నడపండి.. కుటుంబం మీకోసం ఎదురుచూస్తోందనే బోర్డులు చూస్తుంటాం. ఇకపై స్లోగన్ మార్చాలేమో. నడిపేవాళ్లు కాదు.

వాహనం జాగ్రత్తగా నడపండి.. కుటుంబం మీకోసం ఎదురుచూస్తోందనే బోర్డులు చూస్తుంటాం. ఇకపై స్లోగన్ మార్చాలేమో. నడిపేవాళ్లు కాదు నడిచేవాళ్లే చూసుకుని వెళ్లండనే బోర్డులు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో మందుబాబులు పేట్రేగిపోతున్నారు. పూటుగా తాగి, కారెక్కి యాక్సలరేటర్‌ తొక్కుతున్నారు. బండి రోడ్డుపై వెళ్తోందా, మనుషులపైకి ఎక్కుతోందా అన్నదేం చూడ్డం లేదు.

నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. నలుగురి ప్రాణాలు తీసి, మరో ఐదుగురిని ఆస్పత్రి పాలుచేశారు. పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సరిగా చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే సమయంలో ఊదమంటూ హడావుడి చేస్తున్నారు తప్ప.. అర్ధరాత్రిళ్లు ఈ చెకింగులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఐటీ కారిడార్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనే ఈ తరహా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నా.. బడాబాబుల కోసం టెస్టులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో జరిగిన యాక్సిడెంట్‌.. మద్యంబాబుల వికృత రూపాన్ని చూపిస్తుంది. తప్పతాగి, కారు నడిపిన ఓ పెద్ద మనిషి.. ఇద్దరు అమాయకుల ప్రాణాలు తీశాడు. రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వాళ్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తాగిన మత్తులో కారును అతివేగంగా నడపడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన ఇద్దరు యువకులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వలస వచ్చారు. సోయి లేనంతగా తాగిన ఓ బడాబాబు కారణంగా.. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

బంజారాహిల్స్‌లో డ్రంక్‌ అండ్‌ హిట్ ఘటన మరవకముందే.. నార్సింగిలో మరో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి. దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సంజయ్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

సామాన్యులు, వీఐపీలే కాదు.. డాక్టర్లు కూడా తప్పతాగి నలుగురి ప్రాణం మీదకు తెచ్చారు. మదాపూర్‌లో ఈ మందుబాబుల వీరంగం మామూలుగా లేదు. దుర్గం చెరువు దగ్గర్లోని ఓ పబ్‌లో కడుపునిండా మద్యం తాగి, కళ్ల నిండా మత్తు నింపుకున్న ముగ్గురు డాక్టర్లు.. కారుతో నలుగురిని ఢీకొట్టారు. కారులో ఉన్న నిఖిల్ రెడ్డి, తరుణ్, అఖిల్‌ డాక్టర్లేనని పోలీసులు తెలిపారు. పబ్‌లో మందు తాగి కారు నడిపిన నిఖిల్.. నడుచుకుంటూ వెళ్తున్న నలుగురిని ఢీకొట్టాడు. అప్పుడే డ్యూటీ ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న వారు కాస్తా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ఎస్‌.ఆర్‌.నగర్‌ బల్కంపేట రోడ్డులోనూ ఓ ఆటో డ్రైవర్‌ తాగిన మత్తులో మహిళను ఢీకొట్టాడు. డ్రైవర్ ర్యాష్‌ డ్రైవింగ్‌కి.. ఏకంగా ఆటోనే బోల్తా కొట్టింది. గాయపడిన మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో తూగుతున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు పట్టుకెళ్లారు. అదృష్టంకొద్దీ ఆ ఆటోలో ప్రయాణికులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే, ఎంత ఘోరం జరిగేదో.

నిన్న ఒక్కరోజే మందుబాబులు జనాలకు చుక్కలు చూపించారు. తమ దారిలో వెళ్తున్నా, రోడ్డు పక్కగా వెళ్తున్నా.. సరాసరిన వచ్చి ఢీకొట్టారు. తాగుబోతుల కారణంగా ఒకే రోజు నలుగురు ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయమేం కాదు. 24 గంటల్లోనే నాలుగు చోట్ల యాక్సిడెంట్లు జరిగి మరో ఐదుగురు ఆస్పత్రి పాలవడాన్ని చిన్నగా చూడ్డానికీ వీల్లేదు.

Tags

Read MoreRead Less
Next Story