Bhadrachalam : రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..!

Bhadrachalam : రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..!
Bhadrachalam : భద్రాద్రి భక్తాద్రిగా మారింది..రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది..శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ.. భక్తకోటి మైమరచిపోతోంది.

Bhadrachalam : భద్రాద్రి భక్తాద్రిగా మారింది..రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది..శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ.. భక్తకోటి మైమరచిపోతోంది..ఆది, సోమవారాల్లో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేకానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది..

కరోనా కారణంగా గత రెండేళ్లుగా వేడుకలు నిరాడంబరంగా నిర్వహించగా.. ఈసారి మహమ్మారి నుంచి ఉపశమనం రావడంతో మళ్లీ భక్తకోటి రామయ్య కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు భద్రాద్రికి తరలివస్తోంది. భక్తులకు స్వాగతం పలికే స్వాగత ద్వారాలను అందంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రామభక్తుల రాకతో భద్రాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి వేలాదిగా తరలిరానుండడంతో.. మిథిలా స్టేడియాన్ని చలువ పందిళ్లు.. చాందిని వస్త్రాలతో అందంగా అలంకరించారు.

గ్యాలరీలు కూడా సిద్ధమయ్యాయి. భక్తుల కోసం గోదావరి తీరంతోపాటు వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక వసతులు, మంచినీరు, మరుగుదొడ్లు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యుత్‌ దీపాల అలంకరణలతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది.. ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.. భక్తుల రద్దీకి సరిపడా లడ్డూ ప్రసాదాలతోపాటు తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు.

శుభకృత నామ సంవత్సరం రెండవ తేదీన పంచాంగ శ్రవణం, తిరువీధి సేవతో రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.. ఏప్రిల్‌ 16న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, పుష్పయాగంతో ముగియనున్నాయి.. శుక్రవారం గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాదివాసం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం జరిగాయి. శనివారం ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.. అభిజిత్‌ లగ్నంలో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సీతారాముల కల్యాణ ఘట్టం కమనీయంగా సాగనుంది.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా కల్యాణానికి భక్తులకు అనుమతి లేకపోవడంతో వేడుకలు సందడి లేకుండానే సాగాయి.. అయితే, ప్రస్తుతం కరోనా నుంచి ఉపశమనం లభించడంతో ఈసారి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని తెలుస్తోంది. మొత్తం 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటోంది.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వేల మంది పోలీసులతో భద్రత పటిష్టం చేసింది. ఇక కళ్యాణం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సీఎంతోపాటు ఇతర మంత్రులు స్వామి సేవలో తరించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story