TRS Plenary 2022: టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం.. 3 వేల మందికి ఆహ్వానం..

TRS Plenary 2022: టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం.. 3 వేల మందికి ఆహ్వానం..
TRS Plenary 2022: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవానికి రంగం సిద్ధమైంది.

TRS Plenary 2022: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలుండడంతో రాష్ట్ర స్థాయిలో TRS బలాబలాలు, ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ, అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ విమర్శలు నేపథ్యంలో ఈ ప్లీనరి జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం HICCలో రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది. గత అక్టోబర్‌లోనే TRS ద్విదశాబ్ధి ప్లీనరీ జరగ్గా.. ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీ TRS నిర్వహిస్తోంది.

ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వారిలో ఉత్సాహం నింపేలా ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3 వేల మందికి ఆహ్వానం పంపారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు గులాబీ రంగు చీరల్లో హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10-11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. స్వాగతోపన్యాసం, సీఎం కేసీఆర్ స్పీచ్‌ ఉంటాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ప్లీనరీ తీర్మానాలకు ప్రాధాన్యం ఉంది. ఈ సారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు సమాచారం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, కేంద్ర వైఫల్యాలపై ఉండనున్నాయి. వీటితో పాటు టీఆర్ఎస్‌ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, పురస్కారాలు, తదితర అంశాలపై తీర్మానాలుంటాయని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ మూడో సారి గెలుపును సొంతం చేసేకోవాలన్న పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తోంది. 80 వేలకు పైగా ఉద్యోగాల ప్రకటన, ఒప్పంద ఉద్యోగాల క్రమబద్దీకరణ, సొంతంగా ఇళ్లు కట్టుకునే వారికి 3 లక్షల సాయం, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, జీవో 111 రద్దు..ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story