తెలంగాణలో బీజేపీ బలపడుతుంది : బండి సంజయ్!

తెలంగాణలో  బీజేపీ బలపడుతుంది : బండి సంజయ్!
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే విడుదల కాలేదు కానీ అధికార,ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే విడుదల కాలేదు కానీ అధికార,ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం అప్పడే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది బీజేపీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ..పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేస్తామన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చుగ్‌. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్‌ గాలికి వదిలేశారన్నారు. ప్రగతి భవన్‌కు కూడా రాకుండా ఫాంహౌస్‌లోనే ఉండి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తే కవిత ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారాయన. వరంగల్‌లోని హన్మకొండ సీడీసీ కాలేజీలో తురణ్‌ చుగ్‌ ప్రసంగించారు.

అటు తెలంగాణ బీజేపీ మరింత బలోపేతమవుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. తమ ఎమ్మెల్యేలను, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. వరంగల్ అభివృద్ధికి 2 వేల కోట్లు ఖర్చుపెట్టామని వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి స్మార్ట్ సిటీ పధకం ఇచ్చామని చెప్పారు బండి సంజయ్. కేంద్రం ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వరద సాయం వరంగల్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎ్రరబెల్లి కౌంటర్‌ సవాల్‌ విసిరారు. కేంద్రం నిధులు ఏం చేశామో నయా పైసాతో సహా లెక్కచెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.

గ్రేటర్‌ వరంగల్‌లో అధికారాన్ని నిలుపుకోవాలని అధికార టీఆర్ఎస్ ఓరుగల్లు కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో షెడ్యూల్‌కు ముందే ఎన్నికల హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది..

Tags

Read MoreRead Less
Next Story