JP Nadda : రేపు కరీంనగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda : రేపు కరీంనగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
JP Nadda : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. సంజయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నేతలు.

JP Nadda : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. సంజయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నేతలు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు కరీంనగర్ కు వస్తున్నారు. సంజయ్ దీక్ష చేసిన ఎంపీ ఆఫీసును పరిశీలించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని జేపీ నడ్డాకు వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ తోపాటు లక్ష్మణ్, డీకే అరుణ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం ఓర్వలేక కేసీఆర్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బండిసంజయ్ అరెస్టు విషయాన్ని అంత తేలిగ్గా వదలమని హెచ్చిరించారు. ఉద్యోగుల కోసం బండి సంజయ్ దీక్ష చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొవిడ్ ప్రోటోకాల్‌ గురించి టీఆర్ఎస్‌ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. సంజయ్ సహా ఇతర నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు.

అంతకుముందు బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది కరీంనగర్ కోర్టు. సంజయ్ తో పాటు మరో నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు. సంజయ్ తమపై దాడి చేశారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో బండి సంజయ్ పై నమోదైన 10 కేసులను కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న ప్రతిదానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు బీజేపీ నేత, లాయర్ కటకం మృత్యుంజయం. ఎంపీ ఆఫీసుపై పోలీసులే దాడి చేసి... మళ్లీ వాళ్లే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

నా అరెస్ట్ నీ రాజకీయ సమాధి అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. మళ్లీ తిరిగొస్తా నీ భరతం పడ్తా... ప్రజల గొంతుకనై నినదిస్తా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. తన అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బండి సంజయ్. తనతో అనుచితింగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. గవర్నర్ తమిళిసై, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలకు కూడా కస్టడీ నుంచే లేఖ రాసినట్లు తెలిపారు సంజయ్.

Tags

Read MoreRead Less
Next Story