జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులుగా బొల్లినేని రవీంద్రనాథ్ ఏకగ్రీవం..!

జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులుగా బొల్లినేని రవీంద్రనాథ్ ఏకగ్రీవం..!
జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులుగా టీవీ5 MD బొల్లినేని రవీంద్రనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా డి.సునీలారెడ్డి, సొసైటీ కార్యదర్శిగా మురళీ ముకుంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులుగా టీవీ5 MD బొల్లినేని రవీంద్రనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా డి.సునీలారెడ్డి, సొసైటీ కార్యదర్శిగా మురళీ ముకుంద్, అదనపు కార్యదర్శిగా ఆదాల హిమబిందు రెడ్డి, కోశాధికారిగా నాగరాజు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరించింది. ఈనెల 21న జరిగిన ఎన్నికల్లో JHWS ప్యానల్ క్లీన్‌స్వీప్ చేసింది. 15కి 15 MC మెంబర్లను గెలుచుకుంది. ఈ టీమ్ నుంచి ఐదుగురు ఆయా పదవులకు నామినేషన్లు దాఖలు చేయగా...అవన్నీ ఏకగ్రీవమయ్యాయి. వ్యాపారవేత్తలుగా, విద్యావేత్తలుగా, వివిధ రంగాల్లో అపారమైన అనుభవమున్న వ్యక్తులంతా MC మెంబర్లుగా ఉన్నారని.. అంతా కలిసి JHSను ఆదర్శ సొసైటీగా నిలబెడతామని హామీ ఇచ్చారు. తమ ప్యానల్‌ను వెన్నంటే ఉండి నడిపించిన టీవీ5 ఛైర్మన్ BR నాయుడుకు సభ్యులంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

గత సొసైటీలో అక్రమాల్ని వెలికి తీయడంతోపాటు, కబ్జాకు గురైన స్థలాల్ని తిరిగి సొసైటికి వచ్చేలా చేయడం తమ కర్తవ్యమన్నారు JHS అధ్యక్షులు టీవీ5 MD, బొల్లినేని రవీంద్రనాథ్. 5 వేల 200 మంది సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తామని, కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనాన్ని వృద్ధిచేస్తామన్నారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కొంటే వెంటనే మెంబర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని రవీంద్రనాథ్ అన్నారు.

జూబ్లీహిల్స్ హౌసింగ్‌ సొసైటీ ఉపాధ్యక్షురాలిగా డి.సునీలా రెడ్డి ఎన్నికయ్యారు. అందరూ ఏకమైతేనే మార్పునకు నాంది అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి సునీలా రెడ్డి. వైవిధ్యమైన హాబీలు, నైపుణ్యాలు ఉన్న పారిశ్రామికవేత్తగా సొసైటీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కళలు, సాంకేతికతకు సొబగులు అద్దడం కోసం నిరంతర అన్వేషణ చేయడం సునీలా రెడ్డి నైజం. సన్నిహితులు, స్నేహితుల్లో సునీలా రెడ్డికి.. మంచి ఉత్సాహవంతురాలు, ఏదైనా సాధించగల నేర్పరి అని పేరుంది.

JHS కార్యదర్శిగా మురళీ ముకుంద్ ఎన్నికయ్యారు. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో గొప్ప అనుభవం ఉన్నప్పటికీ.. వ్యాపారాలు వదిలేసి ఆయన అభిరుచికి తగ్గట్టు విద్యావేత్తగా ప్రస్థానం మొదలుపెట్టారు. దశాబ్దకాలంగా జూబ్లీహిల్స్‌ స్కూల్‌ మేనేజింగ్‌ కమిటీ ద్వారా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తున్నారు. కోశాధికారిగా నాగరాజు ఎన్నికయ్యారు. ఫార్మాస్యుటికల్ ఇండస్ట్రీలో నాగరాజుకు అపార అనుభవం ఉంది. అయినప్పటికీ సామాజిక సమస్యలపైనే ఎక్కువగా పోరాడుతుంటారు. హోంగార్డ్స్‌కు గౌరవప్రద జీతం ఇవ్వాలంటూ పోరాటాలు చేశారు. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ఆందోళనలు చేపట్టారు.

అదనపు కార్యదర్శిగా ఆదాల హిమబిందు రెడ్డి ఎన్నికయ్యారు. సామాజిక కార్యకర్తగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత హిమబిందు సొంతం. సొంతంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ వైపు భర్త వ్యాపారంలో సహాయం చేస్తూనే.. మరోవైపు ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. తండ్రి నుంచి సహనం, సానుభూతి లక్షణాలు అలవరుచుకుని ముందుకు సాగుతున్నారు.

వీరితోపాటు మిగతా 10 మంది MC మెంబర్లు కూడా ఇప్పుడు సొసైటీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జెట్టి కుసుమ కుమార్‌.... ఆటోమొబైల్ రంగంలో ప్రముఖులు, వీవీసీ గ్రూపును విజయవంతంగా నడిపిస్తున్న వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్..... రియల్ ఎస్టేట్‌ రంగంలో అపార అనుభవశాలి కె.నాగేంద్రప్రసాద్‌... జీడిమెట్ల పారిశ్రామికవాడ అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించిన వ్యాపరవేత్త గరికపాటి శ్రీనివాసు.... ప్రముఖ విద్యావేత్తగా పేరున్న ఆనంద్ కుమార్.... ఐటీ ప్రొఫెషనల్, సామాజిక కార్యకర్త సతీష్‌ చంద్ర.... వైద్యరంగంలోను, సాఫ్ట్‌వేర్ రంగంలోను తనదైన ముద్ర వేస్తున్న మాధవరెడ్డి రావ్ల లాంటి అనుభవజ్ఞులు MC మెంబర్లుగా సొసైటీలో కీలకపాత్ర పోషించబోతున్నారు.

ఎనర్జీ సెక్టార్‌లో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా, కేంద్ర మాజీ మంత్రి భార్యగా తన మార్క్‌తో ముందుకు వెళ్తున్న సుజాత శీలం.... గృహిణిగా ఉంటూనే సామాజిక స్ఫృహతో ఇతరులకు అండగా నిలిచే శ్రీలక్ష్మిరెడ్డి.... ఇప్పుడు మహిళా శక్తికి నిదర్శనంగా JHSలో పనిచేయబోతున్నారు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ ఓం ప్రకాశ్‌ అగర్వాల్ కూడా సొసైటీలో కీలకంగా నిలుస్తున్నారు..

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీవీ5 MD బొల్లినేని రవీంద్రనాథ్‌ని.. టీవీ5 సిబ్బంది సన్మానించారు. టీవీ 5 కార్యాలయంలో ప్రత్యేకంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు..

Tags

Read MoreRead Less
Next Story