హైదరాబాద్‌లో సగం జనాభాకు కరోనా వచ్చిపోయింది!.. సర్వేలో సంచలన విషయాలు

హైదరాబాద్‌లో సగం జనాభాకు కరోనా వచ్చిపోయింది!.. సర్వేలో సంచలన విషయాలు
హైదరాబాద్‌లో ఉంటున్న సగం మంది కరోనా బారిన పడ్డారని సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలీదు.

హైదరాబాద్‌లో 50 లక్షల మందికి కరోనా సోకింది. ఇలా చెబితే భయపడొచ్చేమో గాని.. హైదరాబాద్‌లోని సగం మందికి పైగా కరోనా వచ్చి పోయింది. సీరో సర్వే ప్రకారం.. హైదరాబాద్‌లో ఉంటున్న సగం మంది కరోనా బారిన పడ్డారని తేలింది. అయితే, వీరిలో చాలా మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలీదు. సర్వే ప్రకారం వందలో 75 మందికి తమకు కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదు. కొంత మందికి చాలా స్వల్పంగా లక్షణాలు కనిపిస్తే.. మరికొంత మందికి అసలు లక్షణాలే కనిపించలేదు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారిలో యాండీబాడీలను పరీక్షించిన తరువాత ఈ విషయం బయటపడింది. హైదరాబాదే కాదు తెలంగాణ పల్లెల్లోనూ సీరో సర్వే చేపట్టారు. గ్రామాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్టు జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌ మెల్లగా హెర్డ్ ఇమ్యూనిటీ వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సగం మందికిపైగా కరోనా వచ్చింది. వీళ్లలో యాంటీబాడీలు డెవలప్‌ అయ్యాయి. అంటే, కరోనాను తట్టుకోగలిగే వ్యవస్థ శరీరంలో తయారైందన్న మాట. ఇలా హెర్డ్‌ ఇమ్యూనిటీ వైపు అడుగులు వేస్తే.. మున్ముందు హైదరాబాద్‌లో కరోనా ఉధృతి తగ్గుతుందే తప్ప పెరగదు. పెద్ద వయసు వారికి కరోనా సోకితే కష్టమే అన్న భావన ఉంది. అది నిజం కూడా. కాని, హైదరాబాద్‌లో 70 ఏళ్లు పైబడిన వాళ్లలో దాదాపు సగం మందికి కరోనా సోకింది. అదృష్టం కొద్దీ మరణాల సంఖ్య మాత్రం అంత ఎక్కువేం లేదు. సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌, భారత్‌ బయోటెక్‌ చేపట్టిన సర్వేలో ఈ విషయం తేలింది.

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో వైరస్‌ ఒకే రీతిలో విస్తరించినట్టు జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది. ఎక్కడో కార్వాన్‌ వంటి ఒకట్రెండు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి కాస్త ఎక్కువగా కనిపించినా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో వైరస్‌ ఉధృతి ఒకేలా ఉందని తేలింది. సాధారణంగా కరోనా బారిన పడుతున్న వాళ్లలో మగాళ్లే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే పురుషులకే కరోనా ఎక్కువగా సోకుతోంది. కాని, హైదరాబాద్‌లో మాత్రం మహిళలే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో సైతం ఇదే జరిగింది. దేశ రాజధానిలో పురుషుల కంటే మహిళల్లోనే కరోనా ఎక్కువగా సోకింది. పైగా ఢిల్లీలో కూడా రెండు కోట్ల మందికి పైగా కరోనా వచ్చి పోయింది. అంటే, సగం మందికిపైగా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఢిల్లీ కూడా హెర్డ్‌ ఇమ్యూనిటీ వైపు దూసుకెళ్తోందని గణాంకాలు చెబుతున్నాయి.

తెలుగురాష్ట్రాల్లో కరోనా 440K రకం వైరస్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అయినా సరే మరణాల సంఖ్య, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కరోనా వైరస్‌ అంత ప్రమాదకరం కాదని అర్థమవుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. అయినా సరే రోగనిరోధకత సాధించామని చెప్పలేమని, టీకా ద్వారానే ఇమ్యూనిటీ పవర్‌ మరింత పెరిగేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో యూకే రకం వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. వైరస్‌ ఇంకా ఎంత కాలం వ్యాప్తిలో ఉంటుందో చెప్పలేం కాబట్టి.. మాస్క్‌లు ధరించడం, సమూహాల్లో తిరగకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story