ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు

ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు
ఉద్యోగులకు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రైతుల ఆందోళనను ప్రస్తావించారు భట్టివిక్రమార్క. వ్యవసాయ రంగంపై తమిళిసై గొప్పగా చెప్పారని.. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు భట్టి విక్రమార్క. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర చట్టాలను అసెంబ్లీలో ఒక పరిధి వరకే చర్చించుకోగలమని అన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ సభ్యులున్నారని.. ఈ అంశంపై అక్కడ మాట్లాడాలని సూచించారు. రైతుల ఉద్యమంపై సభ నుంచి.. బయట నుంచి ఇప్పటికే మేం స్పష్టత ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.

ఇక సెక్రటేరియట్‌లో ఆలయాలను యథావిధిగా పునర్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్ధిక క్రమశిక్షణ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో ఉందన్నారు. తెలంగాణకు రాష్ట్ర గీతం లేదన్న కేసీఆర్.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.

మరోవైపు హైకోర్టు అడ్వకేట్స్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని.. న్యాయవాదుల హత్య కేసులో తమ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడిని సస్పెండ్ చేశామని చెప్పారు.

అటు తెలంగాణలో పెరుగుతున్న కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లలో బయట పడుతున్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇక ఉద్యోగులకు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. శాసనసభ వేదికగా రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్‌సీ ప్రకటిస్తామని అన్నారు. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో గత పీఆర్‌సీ ద్వారా వెల్లడించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్‌సీ ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story