ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ ప్రకటన తర్వాత ఉద్యోగుల్లో పెద్దగా స్పందన రాలేదు. రెండేళ్ల క్రితం కూడా సీఎం కేసీఆర్ ఈ విధంగానే ప్రకటించి ఇప్పటివరకు పిఆర్సీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా పి ఆర్ సి కమిటీ రిపోర్టు సిద్ధమైన తర్వాత కేసీఆర్‌ మళ్లీ ప్రకటన చేశారు. ఈ సారైనా హామీలు అమలవుతాయా అన్న సందేహంలో ఉద్యోగులు ఉన్నారు . దీంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘ నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. టీజీవో టిఎన్జీవో సంఘాల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేశారు.

పి ఆర్ సి కమిటీ రిపోర్టు సిద్ధమైంది కాబట్టి త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘం నేతలకు హామీ ఇచ్చారు . అంతేకాకుండా సోమేష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఉద్యోగ సంఘాల సమస్యలపై పూర్తిగా దృష్టి సారిస్తుందని సీఎం అన్నారు . ఇక ఆంధ్ర లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వారంలోగా ఇక్కడకు రప్పిస్తామని చెప్పినట్లు ఉద్యోగ సంఘ నేతలు అన్నారు . సీఎం హామీలపై సంతృప్తిగా ఉన్నట్టు ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు.

అయితే కొద్దిమంది సంఘాల నేతలతోనే సీఎం కేసీఆర్ కలవడాన్ని మిగతా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మీటింగ్‌కు వచ్చిన ఉద్యోగ సంఘాల్లో కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం టి.జి ఓ, టీఎన్జీవో లోని కొద్ది మంది నేతలతో సీఎం మాట్లాడారని మిగతావారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సీఎం కలుస్తున్నారు కాబట్టి ఉద్యోగ సంఘాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి.. ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ కేవలం భోజనం చేసేందుకు కొందరిని ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారని మిగతా ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సీఎం సమావేశం అవుతారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఇలా సీఎం హామీలపై భిన్న వాదనలు వినిపిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల తీరుపై ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు .

Tags

Read MoreRead Less
Next Story