మంత్రులు, కలెక్టర్లతో జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌

మంత్రులు, కలెక్టర్లతో జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌
ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్.

మంత్రులు, కలెక్టర్లతో జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు చెప్పడంతో సీఎం విద్యాసంస్థల పునః ప్రారంభానికి పచ్చజెండా ఊపారు. 9వ తరగతి, ఆపై తరగతులను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో 10 నెలలుగా మూతబడిన పాఠశాలలు మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి.

ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మరికొన్ని కీలక అంశాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సూచించారు.

మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మిగిలిపోయిన లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని కెసిఆర్ ఆదేశించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు కేటాయించి రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం వివరించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ అధికారులను సూచించారు. బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సీఎస్‌ సోమేష్ కుమార్‌ సమావేశం నిర్వహించాలన్నారు సీఎం. పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని, అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story