అసెంబ్లీ అంటే అల్లర్లు,తిట్లు, శాపనార్థాలు కాదు : కేసీఆర్

అసెంబ్లీ అంటే అల్లర్లు,తిట్లు, శాపనార్థాలు కాదు : కేసీఆర్
ఎన్నిరోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకుషంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.. ఎన్నిరోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఈనెల ఏడు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు.. మంత్రులు, విప్‌లతో సమీక్ష నిర్వహించారు.. కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైల జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టం వంటి అనేక అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సీఎం తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదన్నారు.. ఈవేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనభను నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉన్నా సభ్యులు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతి అంశానికీ సంబంధించిన వివరాలు చెబుతుందని, అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సభలో ప్రస్తావించాలన్నారు సీఎం కేసీఆర్‌.

అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదన్నారు సీఎం కేసీఆర్‌. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదన్నారు. ఇలాంటి ధోరణిలో మార్పురావాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలన్నారు. స్ఫూర్తివంతమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. చట్టాలు తయారు చేయడానికి, బడ్జెట్‌ ఆమోదించడానికి బడ్జెట్‌ ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలన్నారు. అసెంబ్లీలో చర్చ ద్వారా అటు ప్రజాస్వామ్యం మరింత బలపడాలని, ఇటు ప్రజలకు ఉపయోగరమైన నిర్ణయాలు వెలువడాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఏ పార్టీ సభ్యులైనా ఏ విషయం గురించైనా సభలో మాట్లాడవచ్చన్నారు. దానికి సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story