Congress: దారిలోకి వచ్చిన సీనియర్లు.. ఇక కాంగ్రెస్ ది దూకుడు మంత్రమేనా?

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy (tv5news.in)

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పెద్ద రచ్చనే రాజేసింది.

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పెద్ద రచ్చనే రాజేసింది. రేవంత్‌ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఆయనపై ఫిర్యాదులు చేస్తూ లేఖలు కూడా రాశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా.. అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు, నిరుద్యోగ యువత సమస్యలపై నిర్వహించిన జంగ్ సైరన్ సభలకు సైతం సీనియర్లు కొందరు డుమ్మా కొట్టారు. టి.కాంగ్రెస్‌ నేతల్లో పరిస్థితులను నిశితంగా గమనించిన అధిష్ఠానం.. సీనియర్లను డిల్లీకి పిలిపించి మంతనాలు జరిపింది. నేతలందరితో ఉమ్మడిగా మాట్లాడడంతో పాటు విడివిడిగా కూడా అభిప్రాయాలను తీసుకుంది.

పార్టీ గీత దాటి బహిరంగంగా మీడియాతో మాట్లాడే నాయకులను, పార్టీలో అంతర్గతంగా సమస్యలను సృష్టించే నాయకులకు ఢిల్లీ పెద్దలు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. విబేధాలు అన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయకపోతే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఢిల్లీ సందేశాన్ని తీసుకుని తిరిగి రాష్ట్రానికి వచ్చిన సీనియర్లలో అప్పుడే మార్పులు మొదలయ్యాయి.

సీనియర్లకు అధిష్ఠానం కాయకల్ప చికిత్స తరువాత భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డితో కలిసి పని చేసేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇటీవల నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతోపాటు సీనియర్లు అంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. దాని తరువాత పార్టీ ప్రకటించిన కల్లాలోకి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు కూడా క్షేత్ర స్థాయిలో నిర్దేశించిన ప్రదేశాలకు సీనియర్లు అంతా వెళ్లి పని చేస్తున్నారు.

కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఇప్పటికైనా తామంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని సీనియర్‌ నేత వి.హనుమంతురావు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని రోజులు.. పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన సీనియర్లు.. కాంప్రమైజ్‌ ధోరణిలో కలిసి వస్తుండడం మంచి శుభ పరిణామమని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అభిప్రాయ పడుతున్నారు. వీళ్లంతా కలిసికట్టుగా ఉంటేనే.. కార్యకర్తలు అంతా మనో ధైర్యంతో పని చేస్తారన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. మొత్తానికి ఢిల్లీ నేతలు ఇచ్చిన మెడిసిన్‌... రాష్ట్ర నేతలను ఐక్యతా రాగం వైపు నడిపిస్తోందని చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story