తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌

తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌
కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ తెలంగాణలో ప్రవేశించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్‌ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు.

కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ తెలంగాణలో ప్రవేశించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్‌ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా కాదా అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్‌ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా జన్యు పరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరసూ.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. అయితే, యూకే వైరస్‌ సోకిన వ్యక్తిలో గాని, ఆయన తల్లిలో గాని ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ లేవు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇతడికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. అయితే, లక్షణాలు మాత్రం లేవు. దీంతో మొత్తం సంఖ్య 21కి పెరిగింది. బ్రిటన్ నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను జన్యు విశ్లేషణ చేస్తున్నారు. వాటి ఫలితాల నివేదికను సీసీఎంబీ గత ఆదివారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.

అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను సీసీఎంబీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. యూకే వైరస్‌ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమీ లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండడంతో వాటన్నింటి ఫలితాలను సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖే వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

కరోనా వైరస్‌ ఇప్పటికే పలుసార్లు మార్పులు చెందగా.. సెప్టెంబరులో ఈ వైరస్‌లో చోటుచేసుకున్న గణనీయమైన పరివర్తనాలు ప్రమాదకరంగా మారినట్లుగా బ్రిటన్‌ గుర్తించింది. శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. యూకేలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇటలీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ విస్తరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కంటే.. ఈ జన్యు మార్పు చెందిన వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

బ్రిటన్ నుంచి, బ్రిటన్ మీదుగా డిసెంబరు 9 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రానికి 1216 మంది వచ్చారు. ఇందులో 1060 మందిని గుర్తించారు. ఆరుగురు విదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 58 మంది సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలకు అందించారు. రాష్ట్రంలో ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

పాజిటివ్‌లు 21 మందిలో హైదరాబాద్‌వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు.తాజా నిబంధనల ప్రకారం.. యూకే వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే.. పూర్తిస్థాయిలో ఆ వైరస్‌ ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story