తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ .. ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు..

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ .. ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు..
Dengue Fever: తెలంగాణలో ఓ వైపు కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వేళా మరో కొత్త సమస్య వెంటాడుతోంది.

Dengue Fever: తెలంగాణలో ఓ వైపు కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వేళా మరో కొత్త సమస్య వెంటాడుతోంది. కరోనాకు తోడు సీజనల్‌ వ్యాధులు కూడా మానవాళిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. పలు జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. వర్షాకాలం, పారిశుద్ధ్య లోపం వంటి కారణాలతో ఆహారం, నీరు కలుషితమై అనేక మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనూ డెంగ్యూ జ్వరాలు కూడా ప్రబలడంతో జనాలు భయపడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు డెంగ్యూ రోగులు క్యూ కడుతున్నారు. జనవరి నుంచి జూన్ వరకు కేవలం నాలుగు డెంగ్యూ కేసులు మాత్రమే వచ్చాయి. కానీ, ఒక్క జులై నెలలోనే 16 కేసులు నమోదయ్యాయి.

మూడు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రిలో ఒక్క రోజే 25 మందికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రులలో నమోదవుతున్న రోగుల సంఖ్య లెక్కేలేదు. నిర్మల్ పట్టణంలోని ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 100 డెంగీ కేసులు నమోదవుతున్నట్టు ఓ అంచనా.

డెంగ్యూ లక్షణాలు కరోనాను పోలి ఉండడంతో జనం కంగారు పడుతున్నారు. జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలే డెంగ్యూకు కూడా ఉండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు వైద్యులు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిలో జ్వరం వెంటనే దాడి చేస్తుందని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్‌లెట్స్‌ పడిపోయి ప్రాణాపాయం కలగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు.

ఇటు నిజామాబాద్‌ జిల్లాను సీజనల్‌ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా, టైపాయిడ్‌ బారిన పడిన జనం మంచం పడుతున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అనారోగ్యం బారిన పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రితో పాటు... ఉమ్మడి జిల్లాలోని ఏరియా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. గత సీజన్‌లో రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌లోనే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఏది సీజనల్‌ వ్యాధో... ఏది కరోనానో తెలియక ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు. అయితే ఈ రెండింటిలో దగ్గు లక్షణాలు ఒకేలా ఉంటాయని... ప్రజలు ఆందోళన చెందకుండా... అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story