దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు.. టెన్షన్‌తో తలులు పట్టుకుంటోన్న ప్రధాన పార్టీలు!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు.. టెన్షన్‌తో తలులు పట్టుకుంటోన్న ప్రధాన పార్టీలు!

దుబ్బాక ఉప ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. క్రాస్‌ ఓటింగ్‌ ఏ పార్టీకి ప్లస్ అవుతుందో ఏ పార్టీకి మైనస్‌ అవుతుందో తెలియక నేతలు టెన్షన్ పడుతున్నారు. బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలదీ అదే పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఇప్పుడు దుబ్బాక ఫలితాల వైపు చూస్తోంది. ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో అర్థం కాక ప్రతి ఒక్కరికీ టెన్షన్ పట్టుకుంది . క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీలకు, నేతలకూ టెన్షన్ రెట్టింపు అయ్యింది. నిజంగానే దుబ్బాకలో క్రాస్ ఓటింగ్ జరిగిందా..? జరిగితే ఏ పార్టీకి లాభం చేకూరుతుంది..? ఏ పార్టీని కొంప ముంచుతుంది..? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాఫిక్.

దుబ్బాకలో మొత్తం లక్షా 98 వేల 807 మంది ఓటర్లున్నారు. అయితే.. లక్షా 61 వేల 881 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 82 శాతం ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోల్చితే 4 శాతం మేర ఓటింగ్ తక్కువగా నమోదయ్యింది. ఉపఎన్నికలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం కూడా అరుదే. 2018లో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం టిఆర్ఎస్‌కు కలిసి రావడంతో భారీ మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఇది.. ఎవరికి లాభిస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి తోడు.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎవరికి లాభిస్తుంది..? ఏ పార్టీని కొంప ముంచుతుంది..? అన్న అంశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి.

అయితే.. ప్రధాన పోటీ బిజెపి, టిఆర్ఎస్ మధ్యే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి పోటీనే ఇచ్చింది. చేగుంట, నార్సింగి, దుబ్బాక పట్టణంతో పాటు తొగుట మండలాలలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇది ఎవరికి లాభిస్తుందన్న లెక్కల్లో రాజకీయపార్టీలు బిజీ అయ్యాయి. చేగుట, నార్సింగి మండలాల్లో టిఆర్ఎస్, బిజెపి మధ్య భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామాల వారిగా, బూతుల వారిగా లెక్కలుతీస్తున్నారు. తొగుట మండలంలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్..ఈ మూడు పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు మండలాలు, గ్రామాల వారిగా ఇన్‌ఛార్ట్‌లను నియమించాయి. క్రాస్ ఓటింగ్ భయం వీరికే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో. క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభిస్తుందో.. ఎవరి కొంప ముంచుతుందో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story