నేడే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక.. సీల్డ్ కవర్ లో ఉన్న అదృష్టవంతులు ఎవరు?

నేడే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక.. సీల్డ్ కవర్ లో ఉన్న అదృష్టవంతులు ఎవరు?
గ్రేటర్ పీఠం దక్కేదెవరికి...? సీల్డ్ కవర్ లో ఉన్న అదృష్టవంతులు ఎవరు? గులాబీ బాస్ ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి. ఇప్పుడు సర్వత్రా ఇదే ఉత్కంఠ.

గ్రేటర్ పీఠం దక్కేదెవరికి...? సీల్డ్ కవర్ లో ఉన్న అదృష్టవంతులు ఎవరు? గులాబీ బాస్ ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి. ఇప్పుడు సర్వత్రా ఇదే ఉత్కంఠ. ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెలలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇవాళ జరగనుండటంతో ఇప్పుడు అందరి చూపూ జిహెచ్ఎంసి వైపే ఉంది. సభ్యుల సంఖ్యను బట్టి టీఆర్‌ఎస్‌ సులభంగా ఈ రెండు పదవులను దక్కించుకునే అవకాశాలున్నాయి. అటు అభ్యర్థులను నిలబెట్టడానికి మిగిలిన రెండు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం 10.45 గంటలకు 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్‌ అఫిషియోలు బల్దియా సమావేశమందిరానికి రావాలి. 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది.11.30కు మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగి రెండు నెలలైనా .. మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేది టిఆర్ఎస్ అధిష్టానం సీక్రెట్ గా ఉంచింది. మరికొన్ని గంటల్లో సీల్డ్ కవర్ లో గ్రేటర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తేలనుంది. కార్పొరేటర్ లతోపాటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్స్అఫీషియో మెంబర్స్ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటిస్తారు. అందరూ కలిసి ప్రత్యేక బస్సుల్లో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి వెళ్లి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లో పాల్గొంటారు. ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం విప్ జారీచేశారు. అధిష్టానం ఎవరిని ప్రకటించినా అందరూ మద్దతు తెలపాలని కార్యవర్గ సమావేశంలో అధినేత కేసీఆర్ ఆదేశించారు.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కోరం 97 మంది హాజరు మాత్రమే కీలకం. 97మంది సభ్యులు సమావేశానికి హాజరైన పక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. బరిలో నిలిచే మేయర్‌ అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతుంటే వారు మేయర్‌ అవుతారు. కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియోలతో కలిపి మజ్లిస్‌ బలం-54 కాగా.. బీజేపీకి 49 మంది సభ్యులున్నారు. కార్పొరేటర్ల మద్దతుతోనే అధికార టీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకునే అవకాశముంది. గ్రేటర్‌కు చెందిన 14 మంది ఎక్స్‌అఫీషియోలతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 70కి చేరనుంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు ఈ బలం సరిపోతుంది.

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కు వినియోగంపై టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం కార్పొరేటర్ల బలంతో మేయర్‌ పీఠం దక్కించుకునే అవకాశమున్న నేపథ్యంలో పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ఓటును ఇక్కడ వినియోగించుకోవాలా? వద్దా? అన్న అంశంపై ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొందరు ఎక్స్‌అఫీషియోలు ఓటు వేయకుండా ఉండేలా నిర్ణయం తీసుకునే సూచనలున్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి పార్టీలు. చట్ట ప్రకారం విప్‌ను ధిక్కరించిన కార్పొరేటర్లపై చర్యలు ఉంటాయి. అవతలి పార్టీ నిలిపిన మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థికి ఓటు వేయడం, ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వంటివాటికి పాల్పడితే వేటు పడుతుంది. ఎంఐఎం తరఫున మేయర్‌, ఉపమేయర్‌ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్సీ జాఫ్రీకి ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్‌, బీజేపీ నుంచి కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ విప్‌లుగా ఉంటారు. ఇక ఎక్స్‌ అఫిషియోలుగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విప్‌ ఉండదు.

వీరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పక్షంలో చర్యలనేవి ఆ పార్టీల పరిధిలోనే ఉంటాయి. ఇక వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నందున ఎక్స్‌అఫిషియోగా ఓటు వాడుకునేందుకు కొందరిని బల్దియా ఓటింగ్‌కు దూరంగా ఉంచి, రిజర్వు చేసుకోవాలని తెరాస యోచిస్తున్నట్లు సమాచారం. అటు.. బీజేపీ నుంచి ఎన్నికైన 47 మందికి ఆ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌, చింతల రామచంద్రారెడ్డి విప్‌ జారీ చేశారు. ఇవాళ మేయర్‌ అభ్యర్థి పేరును తెలపనున్నారు. బషీర్‌బాగ్‌లోని అమ్మవారి ఆలయంలో సభ్యులంతా పూజలు చేసి నేరుగా బల్దియా కార్యాలయానికి వెళ్తారు

Tags

Read MoreRead Less
Next Story