Etela rajendar : దళితబంధును ఎగ్గొట్టడానికి కేసీఆర్‌ మరో కొత్త నాటకం..!

Etela rajendar  : దళితబంధును ఎగ్గొట్టడానికి కేసీఆర్‌ మరో కొత్త నాటకం..!
దళితబంధు పథకాన్ని ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో.. కారణం మీరంటే మీరని మాటల యుద్ధానికి దిగాయి అధికార ప్రతిపక్షాలు. దళితబంధు ఆగిపోవడానికి బీజేపీయే కారణమని ఆరోపిస్తోంది టీఆర్ఎస్.

దళితబంధు పథకాన్ని ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో.. కారణం మీరంటే మీరని మాటల యుద్ధానికి దిగాయి అధికార ప్రతిపక్షాలు. దళితబంధు ఆగిపోవడానికి బీజేపీయే కారణమని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు లేఖ రాయడం వల్లే దళిత బంధును ఆపేశారంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. క్యాబినెట్ ఆమోదంతో దళితుల అకౌంట్లలోకి డబ్బులు వేసిన తరువాత పథకం ఆగిందంటే కచ్చితంగా ఇది రాజకీయ కోణమేనని ఆరోపించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్, గోనె ప్రకాష్ రావు, పద్మనాభ రెడ్డి సలహాలతోనే ఎన్నికల సంఘానికి లేఖలు రాసి దళితబంధు ఆపించారన్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి లేఖ ఆధారంగా దళితబంధు ఆగిందని ఆరోపించారు.

ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వం దళితబంధుకు ఆమోదం తెలిపిందన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాయడం వల్లే పథకం ఆగిందని ఆరోపించారు. ఇవాళ్టి నుంచి దళితవాడల్లో బీజేపీ ఎలా తిరుగుతుందో చూస్తామని చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ సలహాలతో ప్రేమేందర్ రెడ్డి లేఖ రాయడం వల్లే కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధుకు బ్రేక్‌ వేసిందని గువ్వల బాలరాజు కామెంట్ చేశారు.

అధికారపక్ష ఆరోపణలపై బీజేపీ ధీటుగానే బదులిస్తోంది. దళిత బంధు పథకాన్ని నిలిపివేయడానికి సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని చెబుతోంది. ఎన్నికల కమిషన్‌ స్కీంను ఆపేసేందుకు అవకాశం కల్పించేలా కేసీఆర్‌ వ్యవహరించారన్నారు బండి సంజయ్. ఈసీ పథకాన్ని నిలిపివేస్తుందని తెలిసే మీటింగ్‌ పెట్టి దళితబంధుపై చిలుక పలుకులు పలికారని విమర్శించారు. నిజానికి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్‌ ఎప్పుడూ నిలిపివేయదని, కానీ కేసీఆరే ఆ స్కీం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకుండా చేశారన్నారు. లబ్ధిదారుల అకౌంట్లో పడిన డబ్బును బ్యాంకులు ఫ్రీజ్‌ చేసిన సందర్భాలు భారతదేశంలో జరగలేదని.. కాని, లబ్ధిదారుల అకౌంట్లో సొమ్ము వేస్తూనే.. అదే సమయంలో డ్రా చేసుకోకుండా సీఎం కేసీఆరే ఫ్రీజ్ చేయించారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క దళిత లబ్ధిదారుడికి కూడా నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసి.. దళితులను మరోసారి మోసం చేశారని విమర్శించారు.

దళితబంధును ఎగ్గొట్టడానికి సీఎం కేసీఆర్‌ మరో కొత్త నాటకం మొదలు పెట్టారని విమర్శించారు ఈటల రాజేందర్. GHMC ఎన్నికల్లోనూ ఇలాంటి జిమ్మిక్కులే చేశారని, ఇలాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేసీఆర్‌కి దళితబంధు ఇచ్చే ఆలోచన లేదని తాము మొదటి నుంచి చెబుతున్నామని, భయపడినట్టే జరిగిందని ఈటల కామెంట్ చేశారు. హుజురాబాద్‌లో దళితబంధుపై మీటింగ్‌ పెట్టి 60 రోజులు అయిందని, దళితులపై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే ఇప్పటికే అందరికీ 10 లక్షలు ఇవ్వాలి కాదా అని ప్రశ్నించారు. దళితబంధు ఆపించడంతో కేసీఆర్‌ నిజస్వరూపం మరోసారి బయటపడిందన్నారు ఈటల రాజేందర్.

దళితబంధు ఆగడానికి ఈటల రాజేందరే కారణమంటూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు టీఆర్‌ఎస్ నేతలు. అటు బీజేపీ కూడా కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించింది. అయితే, టీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య తోపులాట జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story