హైదరాబాద్ : వరద సాయం అందడం లేదంటూ బాధితుల ఆగ్రహం

హైదరాబాద్ : వరద సాయం అందడం లేదంటూ బాధితుల ఆగ్రహం
వరదబాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక సాయం అందడం లేదంటూ.. హైదరాబాద్‌లో పలు చోట్లు ఆందోళనకు దిగారు ప్రజలు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే డబ్బులు ఇస్తున్నారని..

వరదబాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక సాయం అందడం లేదంటూ.. హైదరాబాద్‌లో పలు చోట్లు ఆందోళనకు దిగారు ప్రజలు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే డబ్బులు ఇస్తున్నారని, అసలైన బాధితులకు సాయం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్‌, బేగంబజార్‌, ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆర్ధిక సహాయం అందని బాధితులు..... అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్రవాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజులుగా కార్పోరేటర్‌ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

అటు...అంబర్‌పేటలో వరద బాధితుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు మహిళలు. వరదసాయం అందలేదంటూ.. ఎమ్మెల్యే ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో... వెంకటేష్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కిరోసిన్‌ పోసుకుని... ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

ఎల్బీనగర్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న 10వేల రూపాయలు ఆర్ధిక సాయం అందడం లేదంటూ... ఆందోళనకు దిగారు వరదబాదితులు. రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి జీహెచ్‌ఎంసీ కార్యాలయాల వద్ద కూడా బాధితులు ఆందోళనకు దిగారు. జీడిమెట్లలో రాజీవ్‌గాంధీనగర్‌ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. బాలానగర్‌ -మెదక్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో.. భారీగా ట్రాఫిక్‌ స్థంబించింది. గాజులరామారం, కూకట్‌పల్లి ఆస్టెస్టాస్‌ కాలనీ, కర్మాన్‌గాట్‌ వాసులు ఆందోళనకు దిగారు.

సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు వరద బాధితులు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్దనగర్‌, సీతాఫల్‌ మండి తదితర ప్రాంతాల్లో ఎక్కడిక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు. అసలైన అర్హులకు సహాయం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, డిప్యూటీ స్పీకర్‌, కార్పోరేటర్లు, టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు ప్రజలు.

Tags

Read MoreRead Less
Next Story