Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం.. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనం.. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారని, ఇలా ప్రతి ఏటా విగ్రహాల నిమజ్జనానికి

Ganesh immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ అనుమతి ఈ ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితం అని చాలా స్పష్టంగా చెప్పింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశమంటూ చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారని, ఇలా ప్రతి ఏటా విగ్రహాల నిమజ్జనానికి చేస్తున్న ఖర్చు వృధా కాదా అని ప్రశ్నించింది. పైగా ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ పనులకు విఘాతం కలగడంతో పాటు దానికోసం చేసిన ఖర్చు కూడా వృధా అయినట్టే కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ రావడంతో, ఆ ఉత్తర్వులను అమలు చేసేంత సమయం లేకపోయిందని సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు విన్నవించారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఇబ్బందేనన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసన్నారు. వచ్చే ఏడాది నుంచి హైకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పుకొచ్చారు. భారీ విగ్రహాల కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.

హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి కేసు విచారణ హైకోర్టు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story