జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవాళ్లు అప్లై చేసుకోవాలంటూ బీజేపీ ఆఫర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవాళ్లు అప్లై చేసుకోవాలంటూ బీజేపీ ఆఫర్

గ్రేటర్ ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దుబ్బాక వేడి చల్లారకముందే గ్రేటర్ సెగ అంటుకోబోతోంది. మూడు పార్టీలు ఈసారి నువ్వా నేనా అనేంత రేంజ్‌లో తలపడబోతున్నాయి. మేయర్ పీఠం మాదేనని టీఆర్ఎస్, మా సత్తా చూపిస్తామంటూ బీజేపీ తొడలు చరుస్తున్నాయి. దుబ్బాక ఫలితం ఎలా వస్తుందో తెలీదు గాని.. బీజేపీలో మాత్రం ఓ జోష్ కనిపిస్తోంది. అధికార పార్టీ బలం తెలిసింది కాబట్టి అంతే గట్టిగా ఢీకొట్టాలనుకుంటోంది.

బీజేపీకి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మంచి ప‌ట్టుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గెలిచింది కూడా గ్రేటర్‌లోనే. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో ఒక‌ట్రెండు సార్లు మిన‌హా బీజేపీనే గెలుస్తోంది. బీజేపీలోని ముఖ్యనేతలందరూ హైదరాబాద్ కేంద్రంగా ఎదిగినవారే. అదేంటోగాని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం చతికిలబడుతోంది. ఈ మైనస్‌ను చెరిపేయాలనుకుంటోంది బీజేపీ. ఒకదశలో దుబ్బాకలో అధికార పార్టీకే చెమటలు పట్టించింది బీజేపీ. దీంతో బండి సంజ‌య్ నాయకత్వంపైనా, కొత్త టీమ్‌పైనా ప్రజల్లో ఓ ఒపీనియన్ కనబడుతోంది. అదే టెంపో గ్రేటర్‌లోనూ కొనసాగించాలనుకుంటోంది.

ఈసారి గ్రేటర్ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహంతో వెళ్లబోతోంది బీజేపీ. ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్లంతా అప్లై చేసుకోవాలని అల్టిమేట్టం ఇచ్చింది. ఇలా అప్లై చేసిన వారిలో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన వాళ్లను సెలెక్ట్ చేయాలనుకుంటోంది. గ్రేటర్ ఎన్నికల కోసం నలుగురు అధ్యక్షులను నియమించింది కూడా. వీళ్లే బలమైన అభ్యర్ధులెవరో పరిశీలిస్తారు, ఫైనల్ చేస్తారు. డివిజన్ల వారీగా అభ్యర్ధుల పేర్లను బండి సంజయ్‌కి పంపిస్తారు. మొత్తానికి ఈసారి వడపోత కాస్త గట్టిగానే చేస్తున్నారు.

కేవలం అభ్యర్ధుల ఎంపికే కాదు. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని చెబుతోంది బీజేపీ. ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఓట‌ర్ లిస్టులో వార్డులు తారుమారు అయ్యాయంటోంది. టీఆర్ఎస్, ఎంఐఎంకు ల‌బ్ది చేకూర్చేలా ఓట‌ర్ జాబితాలో మార్పులు చేశారంటూ ఆరోపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో చెబుతామంటోంది. ఎన్నికలు ఏవైనా సరే.. తెలంగాణాలో ప్రత్యామ్నాయం తామేనని నిరూపించాలనుకుంటోంది బీజేపీ.

Tags

Read MoreRead Less
Next Story