జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెర

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెర

రోడ్లు ఖాళీ అయ్యాయి.. మైకులు మూగబోయాయి.. నేతల నోళ్లకు తాళం పడింది.. మొత్తంగా గ్రేటర్‌ వార్‌లో కీలక ఘట్టానికి తెరపడింది.. వారం రోజులపాటు హోరాహోరీగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చివరి నిమిషం వరకు పార్టీలు విమర్శల వర్షం కురిపించుకున్నాయి.. ప్రతి నిమిషాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు చాలానే కష్టపడ్డాయి.

ప్రచారానికి గడువు ముగియడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు దారి మార్చాయి.. ఇప్పటి వరకు స్ట్రయిట్‌ రూట్‌లో ప్రచారం నిర్వహించిన పార్టీలు ఇప్పుడు మరో రూట్‌లో వెళ్తున్నాయి.. ధనం, మద్యం.. ఇలా అన్ని రూపాల్లో ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నాయి.. కొందరు అభ్యర్థులైతే నగదు, చీరలు, వివిధ రకాల వస్తువులు, బహుమతులను పంపిణీ చేస్తూ ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రచారానికి తెరపడటంతో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఎన్నికలు ముగిసే వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.

డిసెంబరు 1న గ్రేటర్‌ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది.. ఉదయం ఏడు గంటలకు మొదలు కానున్న పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది.. కరోనా కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు.. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.. ఓటరు కార్డు లేకపోయినా, ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లను చూపించి ఓ టు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.. ఒక పోలింగ్‌ రో జున అభ్యర్థికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు ఈదఫా గ్రేటర్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతున్నాయి.. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

అటు ప్రచారం ముగియడంతో పోలింగ్‌పై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి.. భారీగా ఓటింగ్‌ జరగాలని పార్టీలు కోరుకుంటున్నాయి.. అధికారులు కూడా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.. ఓటు విలువను తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.. అయితే వరుస సెలవులు పార్టీల్లో కొత్త గుబులు రేపుతున్నాయి. వరుసగా ఉద్యోగులకు మూడు, టెక్కీలకు నాలుగు రోజులు సెలవులు రావడంతో పోలింగ్‌ రోజున నగర వాసులు అందుబాటులో ఉంటారా? లేదా? అని టెన్షన్‌ అభ్యర్థుల్లో పెరిగిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story