మేయర్ పీఠంపై మజ్లిస్ గురి

మేయర్ పీఠంపై మజ్లిస్ గురి

హైదరాబాద్‌ పాతబస్తీ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే పాతబస్తీ అనే విధంగా మజ్లిస్ ఆ ప్రాంతంలో గట్టి పట్టు సాధించింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ద‌శాబ్దాలుగా హైదరాబాద్‌లో పాతుకుపోయింది. ఐతే.. ఏ ఎన్నికలైనా ఓల్డ్‌సిటీపై పూర్తి స్థాయిలో పట్టుసాధించే ఎంఐఎం.. ఈసారి గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఏం చేయబోతోందనే ఆసక్తి నెలకొంది. ఈ పార్టీ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 1958 మార్చి 2న అబ్దుల్ వాహిద్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీని స్థాపించారు. సలావుద్దీన్ ఒవైసీ మూడుసార్లు ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ పార్లమెంటుకు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సలావుద్దీన్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2008 నుండి ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చార్మినార్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ పార్లమెంటు నుండి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. అసదుద్దీన్ సారధ్యంలోనే ఎంఐఎం పాతబస్తీ దాటి బయట ప్రాంతాలకు విస్తరించింది. అటు..1996లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ నాలుగు సార్లు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

GHMC ఎన్నికల్లో పట్టు సాధించేందుకు మజ్లిస్‌ పక్కా వ్యుహాలు సిద్దం చేసుకుంటోంది. అధికార పార్టీతో దోస్తీ కొనసాగిస్తూనే.. పాతబస్తీ నుంచి న్యూసిటీవైపు ఆ పార్టీ విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్... 44 డివిజన్‌లను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి అంతకన్నా ఎక్కువ డివిజన్లలో గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హిందూ అభ్యర్థులకే అవకాశం ఇస్తోంది.

హైదరాబాద్‌ మొదటి మేయర్‌గా MIMకు చెందిన అలంపల్లి పోచయ్య ఉన్నారు. GHMC ఏర్పాటయ్యాక 2009-14 మధ్య కాలంలో ఒకసారి కాంగ్రెస్‌ నుంచి డిప్యూటీ మేయర్ ఉంటే.. మరోసారి డిప్యూటీ మేయర్‌గా MIM నుంచి మాజిద్ హుస్సేన్‌ ఉన్నారు. ఆ తర్వాత మాజిద్‌ మేయర్ అయ్యారు. ఈసారి కూడా మేయర్ లేదా డిప్యూటీ మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు మజ్లిస్‌ కసరత్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story