టికెట్‌ వస్తుందా..రాదా అనేది తర్వాత విషయం..ముందైతే నామినేషన్ వేద్దాం..

టికెట్‌ వస్తుందా..రాదా అనేది తర్వాత విషయం..ముందైతే నామినేషన్ వేద్దాం..

టికెట్‌ వస్తుందా.. రాదా అనేది తర్వాత విషయం. ముందైతే నామినేషన్ వేద్దాం.. ఇది ప్రధాన పార్టీల్లోని మెజార్టీ ఆశావహుల ధోరణి. పార్టీలు అధికారికంగా పేరు ఖరారు చేయకున్నా కొందరు నేతలు మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థిత్వం ప్రకటనతో సంబంధం లేకుండా నామినేషన్లు దాఖలుకు ఆసక్తి చూపుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆశావహులు ముందస్తు వ్యూహం అమలు చేస్తున్నారు. నామినేషన్‌ ఉపసంహరణ రోజు వరకు బీ-ఫారం సమర్పించే అవకాశం ఉన్న దృష్ట్యా.. అధికారిక జాబితా వచ్చే వరకు వేచి చూస్తే అసలుకే మోసం జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. ఈ మూడు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గ్రేటర్‌లో వంద సీట్లకుపైగా స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహరచన చేస్తోన్న అధికార పార్టీ 110 నుంచి 115 డివిజన్లలో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని యోచిస్తోన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీకి 101 మంది సిటింగ్‌ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో మెజార్టీ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండగా.. కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు జరిగే సూచనలున్నాయని తెలుస్తోంది. పార్టీ నుంచి ఇప్పటికే కొందరికి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడంతో పాటు నామినేషన్‌ దాఖలుకు ముహుర్తాలు చూస్తున్నారు.

మొదటి రోజు టీఆర్‌ఎస్‌ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. చర్లపల్లి, చిలుకానగర్‌, పటాన్‌చెరు, బాలానగర్‌ డివిజన్ల నుంచి ఆరుగురు ఆశావహులు నామినేషన్‌ వేశారు. పేరు ప్రకటించకున్నా.. మంచి రోజు కావడంతో ఇవాళ నామినేషన్లు వేసేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తర్వాతే కొన్ని డివిజన్లకు సంబంధించి బీ-ఫారం ఇవ్వాలని పార్టీలు భావిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్న నాయకులు ఏదో ఒక పార్టీ బీ-ఫారం దక్కకపోతుందా.. అన్న ధీమాతోనూ నామినేషన్లు వేస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచీ, తూచీ వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతోన్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బలమైన సామాజిక వర్గాల నేతలను పార్టీలో చేర్చుకునేందుకు మంత్రాంగం మొదలుపెట్టారు. ముఖ్యంగా స్థానికంగా ప్రజాదరణ ఉన్న ఇతర పార్టీల నేతలపైనా దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ వారిలో కొందరికి అవకాశం కల్పించే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. మరికొన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి చేరికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. అన్ని డివిజన్లకు సంబంధించిన జాబితా వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా పార్టీలో ఉంటోన్న నాయకులు నామినేషన్ల దాఖలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి రోజు బీజేపీ నుంచి చైతన్యపురి డివిజన్‌లో ఓ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి 29 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల చేసింది. అంతగా ఇబ్బంది లేదనుకుంటే మిగతా డివిజన్లకు సంబంధించి ఇవాళ మరికొందరి పేర్లు ఖరారయ్యే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు కాంగ్రెస్‌ నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story