ఎస్‌ఐ సతీష్ ను అభినందించిన గవర్నర్‌ తమిళిసై.. రాజ్‌భవన్‌కు పిలిపించి సత్కారం!

ఎస్‌ఐ సతీష్ ను అభినందించిన గవర్నర్‌ తమిళిసై..   రాజ్‌భవన్‌కు పిలిపించి సత్కారం!
ఎస్‌ఐ సతీష్ చూపించిన మానవత్వం గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.. అతడు ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఆయనకు ఇప్పించారు.

పోలీసులంటే కర్కశత్వం..ఖాకీ జులం ఇలాంటి మాటలే ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. కానీ పాలకుర్తి ఎస్‌ఐ గండ్రాతి సతీస్‌ మాత్రం శభాష్ పోలీస్‌ అనిపించేలా చేశారు.. వృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బండిపల్లి రాజమ్మ అనే నిరుపేద వృద్ధురాలికి తన సొంత ఖర్చులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు ఎస్‌ఐ సతీష్‌.. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సతీమణి ఉష ఆ ఇంటి ప్రారంభోత్సవానికి వచ్చి ఎస్‌ఐను అభినందించారు. రాజమ్మకు స్వీట్లు తినిపించి అన్ని విధలా అండగా ఉంటమాని హామీ ఇచ్చారు..

85 ఏళ్ల రాజమ్మ భర్త మృతి చెందాడు. కొడుకు దివ్యాంగుడు.. చేదోడు వాదోడుగా ఉన్న కోడలు అనారోగ్యంతో మృతి చెందింది. చిన్న గుడెసెలో కొడుకు, మనవరాలితో ఉంటూ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన పైసలతో పోషించుకుంటోంది. కొద్ది రోజుల కిందట పాము కాటుతో మనవరాలు చనిపోయింది. గత ఆగస్టులో వర్షాలకు గుడిసె కూలిపోయింది.

ఇలా పుట్టెడు కష్టాలతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వృద్ధురాలి విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌ తీవ్రంగా చలించిపోయారు. రోడ్డున ఆమెకు అండగా ఉండాలి అనుకున్నాడు.. అవ్వకళ్లలో ఆనందం చూడాలి అని సంకల్పించుకున్నారు. వెంటనే ఆ వృద్ధురాలికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన సొంతడబ్బులు రెండు లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించారు.

తన సొంత ఖర్చులతో ఇళ్లు కట్టించి ఇచ్చిన ఎస్‌ఐ సతీష్‌కు రాజమ్మ ధన్యావాదాలు చెప్పింది. ఎస్‌ఐ సతీష్ చూపించిన మానవత్వం గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.. అతడు ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఆయనకు ఇప్పించారు. రాజ్‌భవన్‌కు పిలిపించి మరి ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు గవర్నర్‌.


Tags

Read MoreRead Less
Next Story