క్యాన్సర్ బాధితుల కోసం నా జడ.. ఉచితంగా విగ్గులు తయారు చేస్తున్న 'శివ'..

క్యాన్సర్ బాధితుల కోసం నా జడ.. ఉచితంగా విగ్గులు తయారు చేస్తున్న శివ..
జుట్టుని అలా వృధాగా పడేసే బదులు క్యాన్సర్ బాధితులకు దానం చేయమని సలహా ఇచ్చారు.

క్యాన్సర్.. మనిషిని పీల్చి పిప్పి చేసే ఓ మాయదారి జబ్బు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా తీసుకునే కీమో థెరపీ ద్వారా జుట్టు ఊడిపోవడం పేషెంట్స్‌ని మరింత బాధిస్తుంది. ట్రీట్‌మెంట్ అనంతరం వాళ్లు మామూలు జీవితాన్ని గడపాలంటే కొంత ఇబ్బంది పడుతుంటారు. జుట్టు లేదని ఆత్మన్యూన్యతకు గురవుతుంటారు. క్యాన్సర్ పేషెంట్స్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్.. బాధితులకు అండగా నిలుస్తున్నాయి.

రోగులకోసం విగ్గుల తయారీ సంస్థకు ఉచితంగా జుట్టును అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ శివ కుమార్ యాదవ్ గత సంవత్సరం 200 మందికి పైగా జుట్టును సేకరించి 30 మంది క్యాన్సర్ బాధితులకు అప్పగించారు. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శివ కుమార్ యాదవ్ ప్రయాణం..

ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన శివ 2014లో హెయిర్ స్టైలింగ్‌లో డిప్లొమా చేశారు. నగరంలోని పెద్ద పెద్ద సెలూన్‌లలో పని చేశారు. మేకోవర్ కోసం కస్టమర్లు రావడం వారి జుట్టును కత్తిరించుకోవడం చూసినప్పుడు, జుట్టుని అలా వృధాగా పడేసే బదులు క్యాన్సర్ బాధితులకు దానం చేయమని సలహా ఇచ్చారు. కస్టమర్లు తన మాటకు విలువిచ్చి సహృదయంతో జుట్టును దానం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్జీవోలకు జుట్టును పంపిస్తున్నారు. 2018లో ఓ స్నేహితుని సలహా ద్వారా సొంత ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేసి విగ్స్ తయారు చేసి క్యాన్సర్ బాధితులకు అందిస్తున్నారు. ఓ విగ్ తయారీకి 3వేల నుండి 4 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనికి కనీసం ఆరుగురి నుంచి సేకరించిన జుట్టు అవసరమవుతుంది. క్యాన్సర్ బాధితులనుంచి ఏమీ తీసుకోకుండానే వారికి విగ్గులను ఉచితంగా అందిస్తున్నానని శివ తెలిపారు.

నేను దానం చేసే విగ్గుల తయారీకి ఉపయోగించే జుట్టు 100 శాతం సహజ సిద్ధంగా లభించింది అని చెబుతారు శివ. పేషెంట్లు కోరుకున్న విధంగా తాము విగ్గులు తయారు చేసి ఇస్తామని అన్నారు. కొంత మంది స్ట్రెయిట్‌గా కావాలంటారు, మరి కొంత మంది కాస్త కర్వ్ ఉండేటట్లు చూడమంటారు. ఏదేమైనా జుట్టు ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. వారి ముఖంలో సంతోషం చూసినప్పుడు మాకు చెప్పలేని ఆనందం కలుగుతుందని తెలిపారు.

ఎవరైనా జుట్టు దానం చేయాలనుకుంటే వారు కనీసం 12 నుంచి 14 అంగుళా జుట్టు కలిగి ఉండాలి. దాంతో పాటు నాణ్యమైన షాంపూని ఉపయోగించి క్రమం తప్పకుండా షాంపూ చేయాలి. అలాగే ఆయిల్ కూడా క్రమం తప్పకుండా పెట్టుకోవాలి. దానం చేసే ముందు కొన్ని నెలల పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని శివ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story