Top

బోరబండ వాసుల్లో అక్టోబర్ భయం

బోరబండ ఏరియా వాసులను అక్టోబర్ భయం వెంటాడుతోంది. మూడేళ్ళ క్రితం అంటే 2017 అక్టోబర్ లో బోరబండలో భూప్రకంపనలు వచ్చాయి

బోరబండ వాసుల్లో అక్టోబర్ భయం
X

హైదరాబాద్‌ బోరబండలో వరుస భూప్రకంపనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. బోరబండ, వీకర్స్ కాలనీ, సైట్-3ల్లో శుక్రవారం రాత్రంతా ప్రకంపనలు కొనసాగాయి. దీంతో ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే ఉండిపోయారు. జూబ్లీహిల్స్, రహమత్‌నగర్, బోరబండ, సైట్‌-3, SPR హిల్స్, అల్లాపూర్‌ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల మధ్య దాదాపు 12 సార్లు భూమి కంపించింది. బోరబండలో రాత్రి 11 గంటల 25 నిమిషాలకు మరోసారి 5సెకన్ల పాటు పెద్ద శబ్దంతో భూమి కంపించింది. ప్రతిసారి ప్రకంపనలు 5 నుంచి 10 సెకన్ల పాటు కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమిలోంచి భారీ శబ్దాలు వెలువడటంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. భయాందోళనలకు గురైన పలు బస్తీలు, కాలనీల్లోని జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

కేవలం 2 సెకన్ల మాత్రమే భూమి కంపించిందన్నారు NGRI శాస్త్రవేత్త శ్రీనగేష్‌. సిస్మోగ్రాఫ్‌ ద్వారా.. దీన్ని రికార్డు చేశామన్నారు. ఈ భూప్రకంపనల తీవ్రత 1.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు వెల్లడించారు. భూ ప్రకంపనలతో బోరబండ ఏరియా వాసులను అక్టోబర్ భయం వెంటాడుతోంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం అంటే 2017 అక్టోబర్ నెలలో బోరబండలో భూప్రకంపనలు సంభవించాయి. అప్పట్లో రాత్రిళ్ళు జనం టెన్షన్ టెన్షన్‌తో గడిపారు. 2017లోనూ ఇలాగే ఈ ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 15 రోజుల తర్వాత అవి ఆగిపోయాయి. మరోసారి అక్టోబర్‌లోనే భూకంపం రావడంతో స్థానికులు వర్రీ అవుతున్నారు. అయితే...భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు పలు సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ అధికారులు భూప్రకంపనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ప్రజలు భయపడొద్దంటూ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అటు శాస్త్రవేత్తలు సైతం భయపడాల్సిన పని లేదన్నారు. హైదరాబాద్‌ సేఫ్‌జోన్‌గా తేల్చారు. అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా జనం మాత్రం ఇప్పటికీ భయాందోళనలోనే ఉన్నారు. మరోసారి ఇలాంటి ప్రకంపనలు వస్తాయనేమోనని రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES