రూ. 52 లక్షల బిల్లు.. అయినా ప్రాణం లేదు..

రూ. 52 లక్షల బిల్లు.. అయినా ప్రాణం లేదు..
లక్షల్లో బిల్లవుతుంది. అయినా ప్రాణాలు పోతున్నాయి. కోవిడ్ వస్తే కోలుకుంటారో లేదో గ్యారెంటీ లేదు.

లక్షల్లో బిల్లవుతుంది. అయినా ప్రాణాలు పోతున్నాయి. డాక్టర్లు ఏం చికిత్స చేస్తున్నారో అంతుబట్టడం లేదు. బిల్లు చూస్తే మాత్రం గుండె గుభేల్ మంటోంది. తాజాగా ఓ యువ వైద్యురాలికి కోవిడ్ చికిత్స నిమిత్తం చేసిన ఖర్చు రూ.52 లక్షలు. అయినా ఆమె ఊపిరి ఆగిపోయింది. హైదరాబాద్ శివారు కొంపల్లికి చెందిన డాక్టర్ భావన(31)కు 15 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ కళ్యాణ్ తో వివాహమైంది.

వివాహానికి ముందు బేగంపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా పని చేస్తున్నారు. పెళ్లయిన తరువాత వృత్తికి దూరంగా ఉన్నారు. ఈ మధ్య కోవిడ్ బారిన పడడంతో ఏప్రిల్ 22న భావన చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ మే 6 వరకు చికిత్స పొంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే ఆ తరువాత ఏర్పడిన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్ల్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. 26 రోజుల నుంచి ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.

కానీ బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేకపోవడంతో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయింది. ఆ విషయం ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని భర్త కళ్యాణ్ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 94కి చేరినా, పైపు సరిగా లేకపోవడంతో 64కి పడిపోయిందని తెలిపారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో గుండెపోటుకు గురై మరణించారని పేర్కొన్నారు.

ఆస్పత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించాం. మరో రెండు వారాల్లో డిశ్చార్జ్ అవుతుందనుకుంటే అంతలోనే ఇలా అయిందని కళ్యాణ్ వాపోతున్నారు. అయితే ఆమెను బ్రతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Tags

Read MoreRead Less
Next Story