పదినిమిషాలు గడిస్తే నన్ను చంపేసేవారు : డాక్టర్‌ హుస్సేన్

పదినిమిషాలు గడిస్తే నన్ను చంపేసేవారు : డాక్టర్‌ హుస్సేన్
అనుక్షణం ఉత్కంఠ... సినిమా సన్నివేశాల్ని తలపించే ఛేజింగ్‌.... టెక్నాలజీని ఉపయోగిస్తూ నిందితుల కదలికల గుర్తింపు. కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుసుకుంటూ..

అనుక్షణం ఉత్కంఠ... సినిమా సన్నివేశాల్ని తలపించే ఛేజింగ్‌.... టెక్నాలజీని ఉపయోగిస్తూ నిందితుల కదలికల గుర్తింపు. కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల పోలీసుల్ని అప్రమత్తం చేశారు. రాత్రంతా జరిగిన ఆపరేషన్‌లో సైబరాబాద్‌ పోలీసుల వ్యూహం ఫలించింది . రాష్ట్రం దాటిపోయిన నిందితుల్ని... మరో రాష్ట్రం దాటిపోకముందే చుట్టుముట్టి పట్టుకున్నారు.

మంగళవారం మద్యాహ్నం డాక్టర్‌ హుస్సేన్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. రాజేంద్రనగర్‌ పీఎస్ పరిధిలోని హిమాయత్‌ సాగర్‌ దర్గా వద్ద ఎక్సైజ్‌ అకాడమీ పక్కనున్న అపార్ట్‌మెంట్‌ నుంచి డాక్టర్‌ కిడ్నాప్ జరిగింది. దుండగులు బుర్కాలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. డాక్టర్‌ కుటుంబానికి ఫోన్‌ చేసి... 10 కోట్లు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు ముస్తఫా... హుస్సేన్‌ భార్యకు బంధువు. ఆస్ట్రేలియాలో వ్యాపారం చేసి నష్టపోయిన ముస్తఫా... అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఖలీద్ అనే వ్యక్తితో కలిసి...‌ కిడ్నాప్ స్కెచ్ వేశాడు.

కిడ్నాప్‌ జరిగిన వెంటనే సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ కేసును ఛేదించడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. కిడ్నాపర్ల కదలికలపై అనంతపురం పోలీసులకు సమాచారం అందించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆ జిల్లా పోలీసులు... నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. మొదట తపోవనం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కిడ్నాపర్లు కారును ఆపకుండా వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... కిడ్నాపర్ల కారును వెంబడించారు. చివరకు రాప్తాడు మండలం బుక్కచర్ల దగ్గర ఛేజ్‌ చేసి... కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి డాక్టర్‌ హుస్సేన్‌ను విడిపించారు.

నిందితుల నుంచి మత్తు ఇంజక్షన్‌, గన్‌, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో పదినిమిషాలు గడిస్తే తనను చంపేసేవారని డాక్టర్‌ హుస్సేన్‌ తెలిపారు. పోలీసులు తనను కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసును ఛేదించడంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు కీలకంగా వ్యవహరించారు. డాక్టర్‌ కిడ్నాపైన వెంటనే నిందితులు రాష్ట్రం దాటే అవకాశం ఉందనే అంచనాతో.... పొరుగు రాష్ట్రాల పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేశారు. 12 బృందాల్ని రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. కిడ్నాపర్ల వాహనాల కదలికల ఆధారంగా ఆయా ప్రాంతాల పోలీసులతో మాట్లాడారు. సమాచారం అనంతపురం పోలీసులకు చేరవేయడంతో పట్టుకోవడంతో నిందితుల్ని రాప్తాడులో పట్టుకున్నారు. రాత్రంతా ఎప్పటికప్పుడు మూడు రాష్ట్రాల అధికారులతో మాట్లాడుతూ ఫాలోఅప్‌ చేసిన సీపీ సజ్జనార్‌... డాక్టర్‌ను కాపాడినట్టు సమాచారం తెలుసుకుని... ఆ దృశ్యాలు చూసిన తర్వాతే ఇంటికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story