Hyderabad: హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రెయిన్ కోసం అంత ఖర్చా!

Hyderabad: హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రెయిన్ కోసం అంత ఖర్చా!
Hyderabad: హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్‌కు అడుగులు పడుతున్నాయి. మూడు గంటల్లో ముంబై చేరుకునే రోజులు రాబోతున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్‌కు అడుగులు పడుతున్నాయి. అతి త్వరలోనే మూడు గంటల్లో హైదరాబాద్‌ నుంచి ముంబై చేరుకునే రోజులు రాబోతున్నాయి. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్‌ ట్రైన్‌ దూసుకుపోనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ టు ముంబైకి ఎంత లేదన్నా 14 గంటల సమయం పడుతోంది. బుల్లెట్‌ ట్రైన్‌లో కేవలం మూడున్నర గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు. దీనికి సంబంధించి రెండు నెలల్లో ప్రీబిడ్‌ మీటింగ్, టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఏ రూట్‌ నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ వేయాలన్న దానిపై సర్వే కూడా జరిగింది.

వయా జహీరాబాద్‌ అలైన్‌మెంట్‌ను వికారాబాద్‌ వైపు మార్చారు. ఈ దిశగా ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే జరుగుతోంది. హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ రైల్‌ ట్రాక్‌ కోసం గూగుల్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌ కూడా చివరి దశకు చేరింది. గూగుల్‌ మ్యాపింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్‌ను నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు.

దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న హైదరాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్‌ సాకారం అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాని, ఈ ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ రూపొందించేందుకు ఈమధ్యే టెండర్లు కూడా పిలిచారు. నవంబర్‌ 5న ప్రాజెక్ట్‌ ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించి, నవంబర్‌ 18న టెండర్లు తెరుస్తామని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ వ్యయం లక్ష కోట్లు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు.

ముందుగా జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ వేద్దామనుకున్నారు. అంటే ఈ రూట్‌ హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్‌, పుణె మీదుగా ముంబై వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్‌ పొడవు 780 కిలో మీటర్లు. అయితే, దూరం, ఖర్చు తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. అంటే హైదరాబాద్‌ నుంచి వికారాబాద్, తాండూరు, గుల్బర్గా, పుణె మీదుగా ముంబై వెళ్తుంది. ఈ రూట్‌తో దూరం 650 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీంతో ఈ రూట్‌నే ఫైనల్ చేశారు.

వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటికే బుల్లెట్‌ రైల్వే లైన్‌ సర్వే పనులు జరుగుతున్నాయి. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ సంస్థ బుల్లెట్‌ ట్రైన్‌ పనుల్లో స్పీడ్‌ పెంచింది. ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు కావాలని ఈ సంస్థ ప్రతినిధులు వికారాబాద్‌ జిల్లా అధికారులను కోరారు. జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్‌, ధరూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ చేపట్టనున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ టు ముంబై బుల్లెట్‌ ట్రైన్ కల కాదు.. త్వరలోనే సాకారం కాబోతోందన్న క్లారిటీ ఇచ్చారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story