నిర్మల్‌ జిల్లాలో అక్రమ ఇసుక దందా

నిర్మల్‌ జిల్లాలో అక్రమ ఇసుక దందా
నిర్మల్ జిల్లాలోని వాగులు, నదుల నుంచి ఇసుక తరలించడానికి గ్రామ పెద్దలు అనధికార టెండర్లు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ వ్యవహారం నడిపిస్తున్నారు.

తెలంగాణ జిల్లాల్లో అక్రమ ఇసుక దందా యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. అనుమతులు లేకుండా వాగులు, నదుల నుంచి ఇసుక తీస్తే చర్యలు తీసుకుంటామన్న అధికారుల మాటలు.. కేవలం స్టేట్‌మెంట్లకే పరిమితం అవుతున్నాయి. తమ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్న మాటలు కూడా నీటి మూటలుగానే మిగిలాయి. నిర్మల్ జిల్లాలో అధికారుల మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్మల్ జిల్లాలో వాగులు, నదుల నుంచి అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుకకు అడ్డుకట్ట పడటం లేదు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గోదావరి నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఈ తతంగం బహిరంగంగానే జరుగుతోంది. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైనా, ఎవరైనా ఫిర్యాదు చేస్తే పట్టుకొని, ఫైన్ వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. అసలు అక్రమ తవ్వకాలు జరక్కుండా చూడడం లేదని విమర్శిస్తున్నారు.

నిర్మల్ జిల్లాలోని వాగులు, నదుల నుంచి ఇసుక తరలించడానికి గ్రామ పెద్దలు అనధికార టెండర్లు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులను మచ్చిక చేసుకొని అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఇసుక క్వారీలు లేవు. దీంతో ప్రభుత్వ అనుమతుల పేరుతో రోజూ వందల ట్రాక్టర్ల ఇసుకను జిల్లా కేంద్రాలకు తరలిస్తూ, అధిక మొత్తంలో అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.

మామడ మండలం కమల్ కోట్, కొత్తూరు, ఆదర్శ నగర్, కమల్ కోట్ తండా గ్రామ పరిసరాల్లో వందల ట్రాక్టర్ల ఇసుక డంప్ చేశారు. రోజూ రాత్రి.. టిప్పర్ల ద్వారా ఇసుకను నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. వాస్తవానికి వాగులు, నదులలో ఉన్న ఇసుకను నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే తీయాలి. అలా కాకుండా జెసిబి యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తవ్వుతూ ఇసుక తరలిస్తున్నారు. కొందరు ట్రాక్టర్ యజమానులు నదిలోనే ఇసుక జల్లెడ పట్టి అధిక ధరకు విక్రయిస్తున్నారు.

మైనింగ్, రెవెన్యూ అధికారులు అక్కడక్కడా ఇసుక నిల్వలను సీజ్ చేస్తూ, వాహనాలకు ఫైన్‌లు వేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. నేతల అండదండలు, అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నంత వరకు ఈ దందాకు అడ్డుకట్ట పడదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story