గ్రేట‌ర్ లో బీజేపీ ప‌ట్టు క‌దులుతోందా ..?

గ్రేట‌ర్ లో బీజేపీ ప‌ట్టు క‌దులుతోందా ..?
BJP: గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 47 సీట్లలో బల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటామంటూ ప్రక‌టిస్తూ వ‌స్తోంది.

BJP: గ్రేట‌ర్ లో బీజేపీ ప‌ట్టు క‌దులుతోందా? పీసీసీ అద్య‌క్షుడిగా రేవంత్ రాక‌తో వ‌ల‌స‌లుగా వ‌చ్చిన నేత‌లు తిరిగి వెళ్ళి పోతారా? ఇప్పటికే వారంద‌రితో రేవంత్ మంత‌నాలు జ‌రిపాడ‌న్న వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ వీరిని కాపాడుకునేందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో త‌న ప‌ట్టును మ‌రోసారి నిలుపుకుంది బీజేపీ. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో 47 సీట్లలో బల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటామంటూ ప్రక‌టిస్తూ వ‌స్తోంది. బీజేపీకి మొద‌టి నుండి రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే బల‌మైన నాయ‌కులు ఉన్నారు.. ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడే ఎక్కువ‌గా గెలుచుకుంది. ఆలే న‌రేంద్ర, బ‌ద్దం బాల్ రెడ్డి, కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మణ్, రాజాసింగ్ ఇలా అనేక మంది నేత‌లు గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో పార్టీ ని కాపాడుతూ వ‌చ్చారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్యనాయకుల‌ు ఓట‌మి పాలు కావ‌డంతో ఇక బీజేపీ ప‌నైపోయింద‌న్న టాక్ వ‌చ్చింది. ఆ వెంట‌నే జ‌రిగిన పార్లమెంట్ ఎన్నిక‌ల్లో సికింద్రబాద్ నియోజ‌క వ‌ర్గం నుండి కిష‌న్ రెడ్డి ఎంపీగా ఎన్నిక‌వ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కేబినెట్‌ మంత్రిగానూ ప్రమోషన్ పొందారు. దీంతో పార్టీ బలోపేతం కోసం బీజేపీ నేత‌లు కార్యతకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పార్టీ బలోపేతం కోసం ఇత‌ర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులు, వారి వార‌సుల‌ను బీజేపీలోకి చేర్చుకుంది. మాజీ మంత్రులు ముఖేష్ గౌడ్, దేవేంద‌ర్ రెడ్డి , బిక్షప‌తి గౌడ్ కుమారులు విక్రం గౌడ్, వీరేంద‌ర్ గౌడ్, ర‌వి యాద‌వ్ ల‌ను బీజేపీ త‌న పార్టీలో చేర్చుకుంది. గ్రేట‌ర్ కు చెందిన మ‌రో కీల‌క నేత కూన శ్రీశైలం గౌడ్ సైతం బీజేపీ లో చేరిపోయారు. మ‌రో కీల‌క నేత మాజీ మంత్రి పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్దన్ రెడ్డి సైతం బీజేపీలో చేరుతార‌ని వార్తలు వ‌చ్చాయి. దీంతో బీజేపీ పార్టీకీ గ్రేట‌ర్ ప‌రిదిలో పూర్వ వైభ‌వం రావ‌డం ఖాయమంటూ చెప్పుకుంటూ వ‌చ్చారు బీజేపీ నాయ‌కులు.

అయితే పార్టీలో చేర్చుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమితమైన బీజేపీ నాయ‌కత్వం...... వారికి ఆ త‌రువాత ఎలాంటి బాధ్యత‌లు అప్పగించ‌లేదు. దీంతో వారు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అయితే వీరంతా గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేసిన వారే కావ‌డంతో తిరిగి వారిని పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నేత‌లంద‌రినీ రేవంత్ ఇంటికి వెళ్ళి మ‌రీ క‌లిసి వ‌చ్చారు. దీంతో వారు నేడోరేపో కాంగ్రెస్ చేరిపోతారంటూ వార్తలు వ‌చ్చాయి.

అయితే బీజేపీ నాయ‌కులు మాత్రం రేవంత్ రెడ్డి కేవ‌లం మీడియా అటెన్షన్ కోసం తాప‌త్రయ ప‌డుతున్నారంటున్నారు. విష్ణువ‌ర్దన్ రెడ్డి ఇప్పటికీ తమ పార్టీలో చేర‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి క‌లిసి వ‌చ్చిన త‌రువాత వీరేందర్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్ష్యం అయ్యారు.. ఆయ‌నతో పాటు విక్రంగౌడ్ కు కూడా బండి సంజ‌య్ పాద‌యాత్రలో కీలక బాధ్యత‌లు అప్పజెబుతార‌న్న వార్తలు వ‌స్తున్నాయి.

కూన శ్రీశైలం గౌడ్ కు ఇప్పటికే హుజూరాబాద్ లో ఓ మండ‌లం బాధ్యత‌లు అప్పజెప్పింది అధిష్టానం. బిక్షప‌తి యాద‌వ్ కుమారుడు ర‌వి యాద‌వ్ కు బ‌రోసా ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ స్వయంగా ఆయ‌న ఇంటికి వెళ్ళి వచ్చారు. వారిలో ఎలాంటి అసంతృప్తి లేద‌ని .. అంతా కలిసే ఉన్నామ‌న్న సంకేతం ఇచ్చేందుకే సంజ‌య్ ఇలా ఆయ‌న ఇంటికి వెళ్ళి వ‌చ్చార‌ని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో కొత్తగా చేరిన నేత‌లు ఎప్పుడు ఎవ‌రు పార్టీ వీడుతారో తెలియ‌ని పరిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ అదిష్టానం ఎలాంటి కార్యాచ‌ర‌ణ తో ముందుకు వెళ్తుంది.. నేత‌ల‌ను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story