బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోందా?

బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోందా?
బీజేపీతో జతకట్టడం వల్ల మైనారిటీ ఓట్లు కోల్పోతున్నాం అనే మాట చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన అంశం. పొత్తులో పరస్పర ఆరోపణలు, అసంతృప్తులు సహజమే అయినా.. బీజేపీ వల్ల ముస్లిం, ఎస్సీ, ఎస్టీలు దూరమయ్యారు

బీజేపీ, జనసేన మధ్య దూరం పెరుగుతోందా? అసలు ఈ అనుమానమే అక్కర్లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌. మొన్న పవన్‌, నిన్న పోతిన మహేశ్ కామెంట్లు చూస్తే చాలా క్లియర్‌ కట్‌గా తెలిసిపోతోందని చెబుతున్నారు. బీజేపీతో జతకట్టడం వల్ల మైనారిటీ ఓట్లు కోల్పోతున్నాం అనే మాట చాలా సీరియస్‌గా పరిగణించాల్సిన అంశం. పొత్తులో పరస్పర ఆరోపణలు, అసంతృప్తులు సహజమే అయినా.. బీజేపీ వల్ల ముస్లిం, ఎస్సీ, ఎస్టీలు దూరమయ్యారు అనడం అన్నిటికంటే పెద్ద కామెంట్‌ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీతో పొత్తువల్లే జనసేన ఘోరంగా ఓడిపోయిందని పోతిన మహేష్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బీజేపీతో కలిసి నడిస్తే అధికారంలోకి రావడం అసాధ్యం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క విజయవాడలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలది ఇదే అభిప్రాయంగా తెలుస్తోంది. మొన్న పవన్‌, నిన్న పోతిన మహేశ్‌ కామెంట్స్‌ చూస్తుంటే.. ఓ ప్లాన్‌ ప్రకారమే మాటల దాడి చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ నుంచి విడిపోవడానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తెకు జనసేన మద్దతు పలకడమే ఓ సంకేతంగా చెప్పుకుంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు తమను గౌరవిస్తుంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం తమను చులకనగా చూస్తున్నారని డైరెక్టుగా పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. అంతటితో ఆగకుండా పోలింగ్ జరుగుతుండగానే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి బీజేపీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమే ఇది. జనసేన అధికార ప్రతినిధి పోతినేని మహేశ్ కామెంట్లు కూడా చిన్నవేం కావు.

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో జనసేనకు ఓట్లు రాకపోవడానికి బీజేపీనే కారణమని ఆరోపించారు పోతిన మహేశ్. బీజేపీతో పొత్తు వల్ల ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు దూరమయ్యారని డైరెక్టుగానే ఫైర్ అయ్యారు. విజయవాడలో బీజేపీ తమకు సపోర్ట్ చేయలేదని ఫలితంగా పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న చోట కూడా తాము ఓడామని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్, పోతిన మహేశ్ చేసిన కామెంట్లను చాలా సీరియస్‌గా పరిగణించాల్సినవే.

2019 ఎన్నికల్లో జనసేనకు 6.17 శాతం ఓట్లు పడగా.. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 4.67 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకు కాస్త పెరిగింది. తమతో పొత్తు వల్ల బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరిగిందని వాదిస్తోంది జనసేన. పైగా బీజేపీతో పొత్తు కారణంగా తమ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గిందని జనసైనికులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని, దీని ప్రభావం తమపై పడుతోందననేది జనసైనికులు వాదిస్తున్నారు.

బీజేపీతో పొత్తు కారణంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో జనసేన పాల్గొనడం లేదు. ఆ ఎఫెక్ట్ విశాఖలో జనసేనపై బాగానే చూపించింది. దీంతో విశాఖలో కేవలం 3 డివిజన్లకే పరిమితమైంది. దీనికి తోడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ నేతల అత్యుత్సాహం, జనసేన బలంగా ఉన్నా సీటు కేటాయించకపోవడం కూడా అసంతృప్తికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. జనసేనను కేవలం మద్దతిచ్చే పార్టీగానే చూస్తుండటం జనసేనానికే నచ్చలేదన్న చర్చ కూడా జరుగుతోంది. త్వరలోనే బీజేపీ నుంచి విడిపోయి ఒంటరిగా పోరాడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story