ఉద్యోగాల పేరుతో నీచ రాజకీయాలా.. మంత్రి కేటీఆర్ ఫైర్..!

ఉద్యోగాల పేరుతో నీచ రాజకీయాలా.. మంత్రి కేటీఆర్ ఫైర్..!
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించలేని బీజేపీ నేతలు... కేసీఆర్‌ను విమర్శిస్తే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు.

ఆరేళ్ల కాలంలో వరంగల్‌కు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించలేని బీజేపీ నేతలు... కేసీఆర్‌ను విమర్శిస్తే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. కేటీఆర్ వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కాజీపేట నిట్‌లో మాట్లాడారు. వరంగల్ పర్యటనకొస్తే ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారని తెలిపారు. ఉద్యోగాల నియామకంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని చెప్పారు. లక్షా 32వేల 889 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

నిరుద్యోగి సునీల్ ఆత్మహత్యపై కేటీఆర్‌ స్పందించారు. విపక్షాలు రెచ్చగొట్టడం వల్లే సునీల్‌ చనిపోయాడని అన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడని... ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏప్రిల్ 21న టీఆర్ఎస్ రెండుగా దశాబ్దాల ఉత్సవాలు జరుపుకోబోతుందని తెలిపారు. 2001లో టీఆర్ఎస్‌కు కుల బలం, ధన బలం, మీడియా బలం, సినీ గ్లామర్ లేవని.. సవాళ్ల మధ్య టీఆర్ఎస్ పుట్టిందని గుర్తుచేశారు. ఎత్తిన జెండా దించితే... రాళ్లతో కొట్టండని కేసీఆర్ చెప్పారని అన్నారు. సంస్కారం లేకుండా కేసీఆర్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పధ్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తెలంగాణలో సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు. పరిపాలనపరంగా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని తెలిపారు. వరంగల్ జిల్లా అంటే కేసీఆర్‌కు అభిమానమని... త్వరలోనే వరంగల్‌కు మైట్రోనియో రైలు తీసుకొస్తామని చెప్పారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story