అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీంలో తెలంగాణ వ్యక్తి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీంలో తెలంగాణ వ్యక్తి

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ టీంలో తెలంగాణ వ్యక్తికి చోటు దక్కింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్ రెడ్డి బైడెన్ టీంలో భాగం కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వినయ్ రెడ్డి తాత తిరుపతిరెడ్డి ఈ గ్రామానికి 30 ఏళ్లు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుమారుడు నారాయణరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నారాయణరెడ్డి ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు.

వినయ్ రెడ్డి అమెరికాలో లా కంప్లీట్ చేసి యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచర్ రైటర్ గా పనిచేశారు. 2012 అమెరికా ఎన్నికల్లో ఒబామా, బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బైడెన్, కమలాహారిస్ లకు స్పీచ్ రైటర్ తో పాటు ట్రాన్స్ లేటర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు వైట్ హౌజ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

నారాయణరెడ్డి కుటుంబం స్వగ్రామమైన పోతిరెడ్డిపేటకు వీలు చిక్కినప్పుడల్లా వచ్చి.. ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే గ్రామంలో పలు కార్యక్రమాలకు ఆర్థిక సాయం కూడా అందించేవారన్నారు. ఇప్పుడు నారాయణరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి.. బైడెన్ టీంలో వైట్ హౌజ్ డైరెక్టర్ గా నియమితుల కావడం సంతోషంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story