Kamareddy : తల్లీకుమారుడి ఆత్మహత్య : మున్సిపల్‌ ఛైర్మన్‌తో సహా ఏడుగురిపై కేసు

Kamareddy :  తల్లీకుమారుడి ఆత్మహత్య : మున్సిపల్‌ ఛైర్మన్‌తో సహా ఏడుగురిపై కేసు
Kamareddy : కామారెడ్డిలో తల్లి, కుమారుడు ఆత్మాహుతి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Kamareddy : కామారెడ్డిలో తల్లి, కుమారుడు ఆత్మాహుతి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో, ఆడియో ఆధారంగా ఏడుగురిపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై A1గా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, A2గా మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ యాదగిరి, A3గా పృథ్వీగౌడ్‌, A4 తోట కిరణ్‌, A5 కన్నాపురం కృష్ణా గౌడ్‌, A6 స్వరాజ్‌, A7గా సీఐ నాగార్జున గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అంటున్నారు.

నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్‌ జిల్లా పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామారెడ్డిలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి గంగం సంతోష్‌, ఆయన తల్లి పద్మ ఆత్మాహుతి చేసుకున్నారు.

తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన పల్లె జితేందర్‌గౌడ్‌, పృథ్వీరాజ్‌, యాదగిరి, తోట కిరణ్‌, కృష్ణాగౌడ్‌, యాదగిరి కుమారుడు స్వరాజ్‌, ప్రస్తుతం తుంగతుర్తి సీఐ నాగార్జునగౌడ్‌ కారణమంటూ ఫేస్‌బుక్‌లో వేర్వేరుగా సెల్ఫీ వీడియోలు పెట్టి ఆత్మాహుతి చేసుకున్నారు. సంతోష్‌.. అతని తల్లి పద్మ ఈనెల 11వ తేదీన కామారెడ్డి వెళ్లారు. అక్కడ కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జ్‌లో రూమ్‌ తీసుకున్నారు. 5 రోజులుగా అక్కడే ఉన్నారు.

ఈ ఆత్మహత్యలతో రామాయంపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. అజ్ఞాతంలో ఉన్న మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ యాదగిరి ఆడియోలు బయటికి వచ్చాయి. తాము ఏం తప్పు చేయలేదని.. తప్పు చేయనప్పుడు ఎందుకు లొంగిపోతామన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story